Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా పోరాటాలదే అంతిమ విజయం
- ఫిబ్రవరి 23,24 తేదీల్లో రెండ్రోజుల సమ్మెను జయప్రదం చేయండి : ఎస్డబ్ల్యుఎఫ్ సమావేశంలో ఎం. సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున అన్నదాతలు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ఉద్యమ విత్తనాలు వెదజల్లిందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. ప్రజాపోరాటాలదే విజయమని అది నిరూపించిందని తెలిపారు. రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ఆర్టీసీ రక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం కోరుతూ ఫిబ్రవరి 23, 24 తేదీలలో జరిగే రెండు రోజుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సీఐటీయూ సిటీ సెంట్రల్ ఆఫీస్‌లో ఎం.రాంబాబు అధ్యక్షతన తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్, వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు అనుభవిస్తున్న సమస్యలన్నీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగానే వస్తున్నాయన్నారు. 2017 వేతన సవరణ, 2013 వేతన సవరణ బకాయిలు, 5 డీఎలు, ప్రావిడెంట్ ఫండ్, సీసీఎస్ బకాయిలు ఉండటం దారుణమన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు లేకుండా ఉత్త చేతులతో, కన్నీళ్ళతో ఇంటికెళ్ళడం బాధాకరమన్నారు. రాజ్యాంగం కార్మికవర్గానికి కల్పించిన హక్కుల కోసం వినూత్న రూపాలలో ఆందోళనలు నిర్వహించడానికి ఈ జనరల్ బాడీ ప్రేరణ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.రవీందర్ రెడ్డి, కె. గంగాధర్, వీరాంజనేయులు, ఎ.వి. రావు, బత్తుల సుధాకర్, భిక్షపతి, వ్యవస్థాపక కార్యదర్శి వి. రాములు, రీజియన్ల నుంచి 70 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.