Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుండెపోటుతో మరో రైతు మృతి
నవతెలంగాణ-ఇల్లందు/మొగుళ్ళపల్లి/కోనరావుపేట
అప్పులభాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మరో రైతు గుండెపోటుతో మృతిచెందారు. ఈ ఘటనలు భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో గురువారం జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బోటితండాకు చెందిన సపావత్ లక్ష్మ(60) తనకున్న 10 ఎకరాల భూమిలో పత్తి వేశాడు. పంట పెట్టుబడికి రూ.3లక్షలు అప్పు చేశాడు. పత్తి దిగుబడి సరిగ్గా రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలనే మనస్తాపం చెందాడు. దాంతో గురువారం ఉదయం చేను వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ సమయంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని సర్పంచ్ కె. జానకి, ఎంపీటీసీ, సీపీఐ(ఎం), ఎంఎల్ పార్టీ నాయకులు పరామర్శించి ఓదార్చారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మెగుళ్లపల్లి మండలం గుండ్లకర్తి గ్రామానికి చెందిన గూడెపు ప్రభాకర్(54) తనకున్న రెండెకరాలతోపాటు ఎకరం కౌలుకు తీసుకుని మూడేండ్లుగా పత్తి పంట సాగుచేస్తున్నాడు. ఈఏడాది ఎకరం భూమిలో మిర్చి, రెండెకరాల్లో పత్తి పంట వేశాడు. పెట్టుబడికి రూ.3లక్షల దాకా అప్పు చేశాడు. మిర్చి, పత్తికి తెగుళ్లు సోకడంతో పంట దిగుబడి తగ్గడంతో మనస్తాపానికి గురయ్యాడు. దాంతో పంటచేను వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి పడుకున్నాడు. సాయంత్రం కుటుంబ సభ్యులు నిద్ర లేపగా ఎంతకు లేవకపోవడంతో పురుగులమందు తాగినట్టు గుర్తించారు. అప్పటికే ప్రభాకర్ మృతిచెందాడు. మృతుడికి ఇద్దరి పిల్లలున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన యమా నర్సయ్య(58) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఆయనకు ఆరుగురు కూతుర్లు ఉన్నారు. అందరికి పెళ్లిండ్లు అయినవి. వారి పెండ్లిలకు చేసిన అప్పుతోపాటు వ్యవసాయానికి చేసిన అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భూమి అమ్మి అప్పులు తీర్చాలనుకున్నాడు. ఈ తరుణంలో అనారోగ్యానికి గురవడంతో కూతురిని వెంటపెట్టుకొని కరీంనగర్ ఆస్పత్రిలో చూపించేందుకు సిరిసిల్ల నుంచి బస్సులో వెళ్తున్నారు. మార్గమధ్యలో ఒద్యారం గ్రామం సమీపంలో బస్సులోనే గుండెపోటుతో మరణించాడు. మృతుడికి భార్య అమృత ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోనరావుపేట సర్పంచ్ పోకల రేఖసంతోష్, ఎంపీటీసీ దేవరకొండ చారి కోరారు.