Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలించిన సీఐటీయూ, ఐక్య పోరాటాలు
- జీవోలు జారీ చేసిన రాష్ట్ర సర్కారు
- ఇంతటితో ఆగం.. కనీస వేతనం రూ.21 వేల కోసం కొట్లాడుతాం : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మున్సిపల్ కార్మికుల వేతనం, ఆశా వర్కర్ల పారితోషికం పెంపు కోసం సీఐటీయూ, ఐక్య పోరాటాలు ఫలించాయి. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ ఏడాదంతా విడతల వారీగా చేసిన కార్యక్రమాలకు రాష్ట్ర సర్కారు దిగొచ్చింది. ప్రస్తుతం ఆశా వర్కర్లకు రూ.7,500 లభిస్తుండగా..ఆ పారితోషికం 30శాతం పెరిగి రూ.9,750కి చేరింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ ఒకటిని వైద్యా రోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం జారీచేసింది. పెరిగిన పారితోషికం 2021 జూన్ వేతనం నుంచే వర్తిస్తుందని తెలిపింది. మున్సిపల్ కార్మికులకు కూడా 30 శాతం వేతనం పెరిగింది. దీంతో వారి వేతనాలు రూ.15,600, రూ.19,500, రూ.22,750కి చేరాయి. పెరిగిన వేతనాల వల్ల మున్సిపాల్టీల్లో శానిటైజేషన్ విభాగంలో పనిచేసే 29,804 మంది, ప్రజారోగ్య విభాగంలో పనిచేసే 22,533 మంది, 7,271 మంది నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్లు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలో రెండు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు (హైదరాబాద్, వరంగల్), 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీలలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని మూడేండ్లుగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ Ê ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) పోరాడుతున్నది. గతేడాది ఆగస్టులో హుజురాబాద్‌లో పదివేల మంది మున్సిపల్ కార్మికులతో భారీ సభను నిర్వహించింది. కలెక్టరేట్ల ముందు పికెటింగ్‌లు చేపట్టింది. అక్టోబర్ నాలుగో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం, అదే నెల ఎనిమిదిన చేపట్టిన సమ్మెతో మున్సిపల్ కార్మికుల ఐక్యతను సర్కారు దృష్టికి తీసుకెళ్లింది. నవంబర్ నెలలో వంటావార్పు కార్యక్రమాలనూ నిర్వహించింది. అదే సమయంలో మిగతా మున్సిపల్ సంఘాలనూ కలుపుకుని జేఏసీగా ఏర్పడి ఐక్యపో రాటాలకూ పిలుపునిచ్చింది. ఉద్యోగులకు జీతాలు పెంచి మున్సిపల్, జీపీ కార్మికుల్లో ఎక్కువగా వెనుకబడిన సామాజిక తరగతుల వారికి పెంచకపోవడం వివక్షే అవుతుందని గొంతెత్తి నినదించింది. ఈ అంశమూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీఐటీయూ స్వతంత్ర, ఇతర సంఘాలతో కలిసి చేసిన ఐక్య పోరాటాల ఫలితంగా వేతనాల పెంపు జీవో విడుదలైంది. గతంలో కార్మికులు నష్టపోయిన విధంగా ఈసారి జరగరాదని యూనియన్ చేసిన ఒత్తిడి కారణంగా ఏరియర్స్‌తో సహా వేతనాలు చెల్లించాలని జీఓలో పేర్కొన్నది. ఆశావర్కర్లు కలెక్టరేట్ల వద్ద, హైదరాబాద్‌లోని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో దిగొచ్చిన సర్కారు వారికీ పారితోషికాలు పెంచింది.
ఇది కార్మికుల విజయం : ఖమర్ అలీ, పాలడుగు భాస్కర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
వేతనాల పెంపు అనేది మున్సిపల్ కార్మికుల విజయం. పోరాడి వేతనాలు పెంచుకున్న మున్సిపల్ కార్మికులకు జేజేలు. రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డాక్టర్ ఎన్. సత్యనారాయణకు కృతజ్ఞతలు. గురువారం నాడు హాజరు పాయింట్ల వద్ద అన్ని మున్సిపాల్టీలలో కార్మికులు విజయోత్సవ సభలు నిర్వహించాలి. మున్సిపల్ కమిషనర్లు, చైర్పర్సన్లు, మేయర్లకు వేతనాలు అమలుచేయాలనీ, ఇతన సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందించాలని పిలుపునిస్తున్నాం. దీంతో సంతృప్తి చెందం. క్యాటగిరీల వారీగా వేతనాల పెంపు, కనీస వేతనం రూ.21 వేల కోసం మళ్లీ పోరుబాట పడుతాం.
పోరాటాల ఫలితమే : పి.జయలక్ష్మి, కె.సునీత, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
పోరాటాల ఫలితంగానే జీవో నెంబర్ ఒకటి విడుదలైంది. నిరంతరం రాజీలేని పోరాటాలు చేస్తున్నాం. అనేక జిల్లాల్లో పాదయాత్రలు చేసి ఆశా వర్కర్ల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాల్లో ఆఫీసుల ముందు రోజంతా బైటాయించి సమస్యలను ఎత్తిచూపాం. రూ.9,750 పారితోషికంతో సరిపెట్టుకోం. స్మార్టు ఫోన్లు ఇస్తామని అధికారులు చెప్పారు వాటికోసమూ పోరాడుతాం. ఫిక్స్డ్వేతనం, జాబ్‌చార్టు, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. 16 నెలల పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలి. ఇవే అంశాలను గురువారం నాడు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కలిసేందుకు నాతో పాటు మా యూనియన్ ఉపాధ్యక్షులు హేమలత, కోశాధికారి లలిత, నాయకులు ఎం.రేవతి, రాధిక, జయప్రద, ఆర్.విజయ వెళ్లగా ఆయన లేరు. మంత్రి ప్రత్యేక ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా..సానుకూలంగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు.