Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న అంచనా వ్యయం
- ఏడేండ్లుగా కొనసాగుతున్న నిర్మాణం
- రీ-డిజైన్‌తో ఆర్థికభారం
- బి.బసవపున్నయ్య
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమ స్యల వలయంలో చిక్కుకుంది. ఏడేండ్లుగా నిర్మాణం కొనసాగుతూనే ఉన్నది. న్యాయ, సాంకేతిక సమస్యలతో పాటు భూసేకరణ, అంచనా వ్యయం, పునరావాసం, ఏపీతో వివాదం గుదిబండలుగా మారాయి. నిధుల లేమీతో పనులు ఎప్పటికప్పుడు ఆలస్యమవుతున్నాయి. ఒక్కొక్క టిగా సమస్యలు ప్రాజెక్టును ముప్పిరిగొన్నాయి. 2015, జూన్ 11న మహబూబ్‌నగర్ జల్లా బూత్పూర్ మండం కరివెన గ్రామంలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో రీ-డిజైన్ చేసిన సంగతి తెలి సిందే. జూరాల ముందు భాగం నుంచి కాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముందుభాగం నుంచి నీటిని ఎత్తిపోయడానికి(లిఫ్ట్) చేయడానికి ఉద్దేశించారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ముందుభాగంలో రేగుమానుగడ్డ వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథక ప్రాంతానికి ఉత్తరం వైపున పాలమూరు ఎత్తిపోతలకు సర్కారు శ్రీకారం చుట్టిన విషయమూ విదితమే. జూరాల నుంచి కోయిల్‌కొండ వరకు నీళ్లు అందించడానికి 70 టీఎం సీల సామర్థ్యంతోరిజర్వాయర్ను నిర్మించాల్సిఉంది. తద్వారా ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుబాటులోకి వస్తుందని అంచనా. అక్కడి నుంచే కొయిల్‌సాగర్‌కు మూడు టీఎంసీల నీళ్లు ఇవ్వాలి. జూరాలకు మొదట పంచె దిన్నెలపాడు లిఫ్ట్ ద్వారా కొయిల్‌సాగర్‌కు నీళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. తర్వాత అదే లిఫ్ట్‌తో ఏడు లక్షల నుంచి 12.30 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
కీలకమీవే..
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు త్వరి తగతిన నిర్మాణం పూర్తిచేసుకోవాలంటే సర్కారు ముంద స్తుగా పలు సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. భూసే కరణ, పునరావాసం, ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, ఏపీతో వివాదాలను కొలిక్కి తీసుకురావాల్సి ఉంది.
భూసేకరణ
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 26,851 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో పట్టా భూమి 21375 ఎకరాలకుగాను 15,571 ఎకరాలు, ప్రభుత్వ భూమి 5,475 ఎకరాలకు 4,646 ఎకరాలను సేకరించారు. ఇదొక సమస్యగానేఉంది. రియల్ఎస్టేట్ విస్తరించడంతో భూముల రేట్లు మార్కెట్లో బాగా పెరిగాయి. ఈ ప్రాజెక్టు మూలంగా మూడు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో 30 తండాలు ప్రభావితమయ్యాయి. 2,481 కుటుంబాలను తరలించాల్సిఉంది. ఈసందర్భంగా 11,025మంది నిర్వాసి తులవుతున్నారు. వీరికి రూ.80 కోట్లతో డబుల్బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని సర్కారు హామీనిచ్చింది.
అంచనా వ్యయం..ప్రస్తుత స్థితి
ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత రూ. 12 వేల కోట్లుగా నిర్ణయించారు. అంచనా వ్యయం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. కాగా ఇప్పటివరకు రూ. 40 వేల కోట్లు ఖర్చుపెట్టారు. పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) ప్రకా రం రూ.49,595 కోట్ల నిధులు అవసరమని ప్రభుత్వ లెక్క. గత 2019, మార్చి నాటికి రూ.4,872 కోట్లు ఖర్చయింది. 1920-21లో రూ.800 కోట్లు వ్యయం చేశారు. మొత్తం ఇప్పటిదాకా రూ.5,672 కోట్లు వ్యయం చేశారు. 2021 -21లో రూ.960 కోట్లు ఇచ్చారు. కాగా ప్రస్తుతం సర్కారు అంచనా ఖర్చు రూ. 70 వేల కోట్లకు పెరుగుతుందని అధికారవర్గాల సమాచారం. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని అంటున్నవారూ లేకపోలేదు. అంచనా వ్యయం ఎక్కువ కావడంతో పాటు 2,800 మెగావాట్ల విద్యుత్ అవసరమని చెబుతున్నారు.
మూడు జిల్లాలు..టీఎంసీలు
ఈ ప్రాజెక్టు లక్ష్యం 12.50 లక్షల ఎకరాలను ఆయ కట్టుగా స్థీరీకరించడం. ఏడేండ్లవుతున్నా ప్రాజెక్టు పనులు కొలిక్కిరావడం లేదు. అంతేగాక మూడు జిల్లాల నీటి అవసరాలు తీర్చే ఈ ప్రాజెక్టు సామర్థ్యం 120 టీఎంసీల సామర్థ్యం కలది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు, రంగారెడ్డికి 20 టీఎంసీలు, మహబూబ్ నగర్‌కు 70 టీఎంసీలు కేటాయించారు. పాలమూరు, కల్వకుర్తి, జూరాల మీద ఉన్న నెట్టెంపాడు కుడివైపు, బీమా-1 ఎడమ వైపు, బీమా-2 ఎడమవైపు, శ్రీశైలంలోకి నీళ్లు రావు. అందుకే పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ఆపాలని ఏపీ కేంద్ర ప్రభుత్వానికి, జలవనరుల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.
వివాదం
2003లో కృష్ణా మిగులు జలాల పంపిణీ కోసం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నియమించిన సంగతి తెలిసిందే. 2010లో ఆ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పును వెలువరిం చింది. ఇది న్యాయసమ్మతంగా లేదని అప్పుడే తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. 2010లో ఏపీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుంటే సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన కేంద్రం, ఇప్పుడు చడీచప్పుడు చేయడం లేదు. ఇంతవరకూ కృష్ణాజలాల పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయలేదు. ఇది పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
ఎత్తిపోతలు
శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగంలో రేగుమానుగడ్డ వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఉత్తరంవైపు పాలమూరు-రంగారెడ్డికి శంకుస్థాపన చేశారు.
- అక్కడి నుంచి సముద్ర మట్టానికి 250 మీటర్ల ఎత్తుతో ఏర్పాటు చేసి నార్లాపూర్ రిజర్వాయర్‌కు 340 ఎత్తుతో ప్రాజెక్టును నిర్మించాలి. రిజర్వాయర్ నీటి నిల్వ తొమ్మిది టీఎంసీలు.
- నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏదుల రిజర్వాయర్ 445 మీటర్లు, 4.5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించాలి
- ఏదుల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్‌కు 32 మీటర్లు, 4.5 టీఎంసీలతో రిజర్వాయర్ కట్టాలి.
- అక్కడి నుంచి నుంచి గ్రావిటీ ద్వారా కరివెన రిజర్వాయర్‌కు 531 మీటర్లు, 25.52 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం చేయాలి. ఈరిజర్వాయర్ నుంచి 2.28లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలి.
- కరివెన రిజర్వాయర్ నుంచి లోకెరేవ్ రిజర్వాయర్‌కు 625 మీటర్లు, 14.37 టీఎంసీలతో రిజర్వాయర్ కట్టాలి. ఈ రిజర్వాయర్ ఉంచి కుడి ప్రధాన కాలువ ద్వారా 1.09 లక్షల ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి.
లోకెరేవ్ నుంచి ఉత్తర ప్రధాన కాలువ ద్వారా కెపి లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ 675 మీటర్లు, 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి. ఈ రిజర్వాయర్ నుంచి పశ్చిమ ప్రధాన కాలువ ద్వారా 1.30 లక్షల ఎకరాలు, దక్షిణ బ్రాంచ్ కాలువ ద్వారా 25 వేల ఎకరాలు, తూర్పు బ్రాంచ్ కాలువ ద్వారా 30 వేల ఎకరాలు, ఉత్తర ప్రధాన కాలువ ద్వారా 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది.
జిల్లాల వారిగా..
కొత్త జిల్లాల వారీగా ప్రాజెక్టు ఆయకట్టును పరిశీలిస్తే మొత్తం 12.30లక్షల ఎకరాలుగా ఉంది. మహబూబ్ నగర్లో 4,13,167 ఎకరాలు, వికారాబాద్‌లో 3,22,375, నాగర్‌కర్నూల్‌లో 1,00,014, రంగారెడ్డిలో 3,63,900, నల్లగొండలో 30,000, వనపర్తిలో 44 ఎకరాలు ఉంది.
రీ-డిజైన్‌తో..
మొదటి ప్రాజెక్టును రీడిజైన్‌తో 165 అడుగుల ఎత్తుకు అదనంగా నీటిని తోడాల్సి వస్తున్నది. 75 మీటర్లు ఉండాల్సిన ఆయకట్టు కాలువ (రిజర్వాయర్ల లింకేజీ కాలువలు)103 కీలోమీటర్ల దూరం పెరిగింది. పైగా శ్రీశైలంలో 840 అడుగుల నీరు ఉన్నప్పుడే ఈ పథకం పనిచేస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి రోజుకు అన్ని అవసరాలకు కలిపి ఏనిమిది టీఎంసీల నీటిని వాడుకుంటున్నారు. ఏడాదిలో రెండు, మూడు నెలలు మాత్రమే ఈ పథకానికి నీటి లభ్యత ఉంటుంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు రావడానికి జూరాల ద్వారానే సాధ్యం. జూరాల నుంచి 70 నుంచి 80 టీఎంసీల నీటిని తోడడానికి అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టు చిన్నదేకానీ ఎగువ నుంచి నీరు వస్తుంది. పైగావరదలు వచ్చినప్పుడు జూరాల ద్వారా ప్రాజెక్టులను నింపుకోవచ్చు. అంచనా వ్యయం కూడా రూ. 40 వేల కోట్లల్లో రూ. 10 వేల కోట్లు తగ్గుతుంది కూడా. గతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను రీ-డిజైన్ చేయడం మూలనా రాష్ట్ర ప్రజలపై వేల కోట్లు భారంపడే అవకాశ ముంది. ప్రభుత్వాలు ఏంవిధంగా కావాలని కోరితే ఆ విధంగా ఇంజినీర్లు డీపీఆర్‌లను తయారుచేయడం ఆశ్చర్యమే. మొదటి నుంచి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక అనుమానాస్ప దమే. ఆ రిపోర్టుల్లో శాస్త్రీయత లేదు. సాగునీటిరంగ నిపు ణులూ ఇదే చెబుతున్నారు. గతంలో 50 శాతానికిపైగా నిర్మాణం జరిగిన ప్రాజెక్టులనూ రీ-డిజైన్ చేస్తున్నారు. బడ్జె ట్లో కేటాయింపులేగాక సంస్థల ద్వారా ప్రాజెక్టుల కోసం తెచ్చిన అప్పును లెక్కవేస్తే రూ.80 వేల కోట్లు. నాలుగైదేం డ్లు ఆ పనులు కొనసాగాయి. ఏ ప్రాజెక్టుకు ఎంత వ్యయం జరిగింది ? ఇంకెంత కావాల్సింది మాత్రం బడ్జెట్లో గానీ, డిమాండ్స్లోగాని ప్రభుత్వం చూపడం లేదు. గత బడ్జెట్లు పారదర్శకంగా ఉన్నాయి. గులాబీ సర్కారు మాత్రం వ్యయాల లెక్కలను ఎక్కడా ప్రస్తావించడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పథకాల కింద కాలువల పనులను చేపట్టకపోవడం, ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడంతో మూలంగా జిల్లా ప్రజలకు సాగునీరు ఇస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమతమయ్యాయి.నిర్మాణంలోనున్న ప్రాజెక్టుల కాలాన్ని పొడిగించకుండా నిర్దిష్ట సమయంలోగా పూర్తిచేసి రైతులు, ప్రభుత్వానికి ఆదాయం రాబట్టాల్సి ఉంది.