Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
- కేంద్ర మార్గదర్శకాల మేరకే....ఆంక్షలు
- భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
- రాజకీయ కార్యక్రమాలు నియంత్రించుకోవడం అవసరం : డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివిటీ రేటు ఆధారంగా కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో వచ్చే నాలుగు వారాలు కీలకంగా మారనున్నాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. కరోనా విషయంలో కేంద్ర మార్గదర్శకాల మేరకే తెలంగాణలో ఆంక్షలుంటాయని అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. ఐదు రోజుల్లో కేసులు నాలుగు రెట్లు పెరిగాయనీ, రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగి, ఫిబ్రవరిలో తగ్గే అవకాశముందని చెప్పారు. అప్పటి వరకు ప్రజలు మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడమనే కరోనా నిబంధనలను విధిగా పాటించాలని కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించారు.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సభలు, సమావేశాలు నిర్వహించడంపై స్వీయ నియంత్రణ పాటించి సహకరించాలని కోరారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో పాజిటివిటీ రేటు మూడు శాతానికి పైగా ఉందని డాక్టర్ శ్రీనివాస రావు ఈ సందర్భంగా తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉండటంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు అక్కడ ఆంక్షలు పెడుతున్నారనీ, వాటితో పోల్చుకోలేమని స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు పెరిగినా రాష్ట్రవ్యాప్తం గా ఒకే రీతిగా కాకుండా ఆయా ప్రాంతాల్లో రేటును బట్టి అవసరమైన ఆంక్షలు విధించాలంటూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో వస్తున్న పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నామని చెప్పారు. కొత్త వేరియంట్ సోకినప్పటికీ రోగులు కేవలం ఐదు రోజుల్లో కోలుకుంటున్నారనీ, ఆస్ప త్రుల్లో రోగులుచేరే పరిస్థితి రావడంలేదని స్పష్టం చేశారు. అతి కొద్ది మందికి జలుబు, స్వల్పంగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలుంటున్నాయని చెప్పారు.
డెల్టా పోలేదు..
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా డెల్టా వేరియంట్ తో వచ్చే కేసులు పూర్తిగా తొలగిపోలేదని డీహెచ్ స్పష్టం చేశారు. ఈ వేరియంట్ సోకిన వారిలో మూడు రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయని చెప్పారు. కొంత మంది స్వల్ప లక్షణాలు కనపడగానే ఆస్పత్రిలో చేరుతున్నారనీ, ఇది సరైంది కాదన్నారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి అనవసరంగా డబ్బులు వధా చేసుకోవద్దని సలహా ఇచ్చారు. ప్రయివేటు ఆస్పత్రులైనా సరే విధిగా ప్రభుత్వ కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. భవిష్యత్తుల్లో సోకే కరోనా కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్ తోనే ఉంటాయని చెప్పారు.
విద్యార్థుల వద్దకే టీకా
రాష్ట్రంలో 15 నుంచి 17 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన వారిలో 10 శాతం మందికి కరోనా టీకా తొలి డోసు ఇచ్చామని డీహెచ్ చెప్పారు. విద్యార్థుల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. జనవరి 26 నాటికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వెల్లడించారు. జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు ఇవ్వడం ప్రారంభమవుతుం దన్నారు. ప్రజలు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలనీ,రాబోయే రోజుల్లో ఒక శాతం మంది ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా సదుపాయాలపరంగా ఇబ్బంది తలెచ్చవచ్చనీ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదం అని తెలిసి ఎదురుగా వెళితే....
వేగంగా వస్తున్న వాహనానికి ఎదురుగా వెళితే ప్రమాదం జరుగుతుంది...ఈ విషయం తెలిసి ఎవరైనా ఎదురెళతారా?....కరోనా కూడా అంతే.. అది మనవైపు వస్తుందని తెలిసి కూడా మాస్కులు పెట్టుకోకుంటే ఎలా?... ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నాం. కరోనా రాకుండా ఉండేందుకు నివారణతో పాటు సోకిన వారికి అవసరమైన చికిత్సకు ఏర్పాట్లు చేశాం. ఇక ప్రజలే సహకరించాలి. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని మాస్కులు ధరించటం ద్వారా కరోనా నుంచి కాపాడుకోవాలని డీహెచ్ కోరారు.