Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచార గోప్యత పరిరక్షణకు చర్యలు:కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్
- ఈ-పరిపాలనపై 24వ జాతీయ సదస్సు ప్రారంభం
- తెలంగాణకు ఐటీఐఆర్‌పై పునరాలోచించండి : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో డిజిటల్ విప్లవం ప్రారంభమైందనీ, ప్రపంచ డేటా పవర్‌హౌస్‌గా భారతదేశం నిలుస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక (సహాయ), భూగర్భ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణు శాస్త్రం, అంతరిక్ష మంత్రిత్వ (స్వతంత్ర) శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ-పరిపాలనపై ఏర్పాటైన 24వ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. 'కరోనా మహమ్మారి తర్వాత నెలకొన్న పరిస్థితిల్లో డిజిటల్ పరిపాలన-భారతదేశంలో పరిస్థితి' ఇతివృత్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్ విధానం దేశ ప్రజలకు జీవన సౌలభ్యాన్ని అందించిందని అన్నారు. దీనివల్ల దేశంలో పేదలకు, అవసరంలో ఉన్న అనేక లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలిగిందని చెప్పారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనన ధ్రువీకరణ పత్రాలు పొందటం, బిల్లులు, ఆదాయపు పన్ను రిటర్న్‌ల చెల్లింపులు ఇప్పుడు డిజిటల్ ఇండియా ప్లాట్ ఫారమ్ ద్వారా వేగంగా జరుగుతున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ ద్వారా నగదు రహిత, కాగితాలతో వ్యక్తులతో సంబంధం లేకుండా సేవలు అందించడంలో ప్రభుత్వాలు విజయమయ్యాయన్నారు. ఈ-గవర్నెన్స్ లో 26 రంగాలలో సాధించిన అత్యుత్తమ ప్రగతిని ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021లో గుర్తింపు పొందాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'జనహిత' వేదిక ఫిర్యాదుల పరిష్కారం కోసం భారతదేశంలో పని చేస్తున్న అత్యుత్తమ వేదికల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని ప్రశంసించారు. డిజిటల్ విప్లవంలో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు పోటీతత్వ, సహకార స్ఫూర్తిని రెండింటినీ సమ్మేళనం చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుందని ఆకాంక్షించారు. రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ..డీజిటల్ లావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీ వ్యాలెట్‌ను తీసుకొచ్చిందనీ, టీయాప్ ద్వారా 270కిపైగా సేవలను అందిస్తున్నామని చెప్పారు. ఫెస్ట్ యాప్ ద్వారా రవాణా శాఖ 17 రకాల సేవలను అందిస్తున్నదని వివరించారు. రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత కోసం చేసిన కృషిలో భాగంగా 30 వేల ప్రభుత్వ కార్యాలయాలు, 80 లక్షల గృహాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. స్పేస్రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.