Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రార్థన మందిరాల పనులూ త్వరగా ప్రారంభించాలి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై క్షేత్ర స్థాయిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం నిర్మాణంలో ఉన్న సెక్రటేరియట్ భవనాన్ని మంత్రి తనిఖీ చేశారు. అనంతరం అధికారులు,వర్క్ ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు, ఆర్కిటెక్ట్‌తో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి అదేశానుసారం నిర్ణీత గడువులోగా సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థలు, అధికారులను ఆదేశించారు. వర్క్‌చార్ట్ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. అంతస్థులవారీగా అంతర్గత నిర్మాణాలు సీఎం ఆలోచనలకు అనుగుణంగా జరగాలని చెప్పారు. అక్కడక్కడ అధికారులకు, ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులపట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో ఇంకా వేగం పెంచాలన్నారు. అంతస్థులవారీగా ప్రణాళికలను ఈ సందర్భంగా పరిశీలించారు.
మంత్రుల ఛాంబర్లు, అధికారుల ఛాంబర్లు, శాఖల వారీగా సెక్షన్ల అంతర్గత నిర్మాణాలపై కూలంకషంగా చర్చించారు. అంతర్గతంగా జరుగుతున్న గదుల నిర్మాణ పనుల్లో కూడా వేగం పెంచాలనీ, పనులన్నీ సమాంతరంగా జరగాలని మంత్రి అన్నారు. దేవాలయం, మసీదు, చర్చి నిర్మాణాలు జరిగే స్థలాలను, ప్రణాళికలను పరిశీలించిన ప్రశాంత్‌రెడ్డి, ప్రార్థనా మందిరాల నిర్మాణాలను కూడా త్వరగా ప్రారభించాలని అధికారులు, ఏజెన్సీని ఆదేశించారు. బ్లాక్‌లవారీగా స్లాబ్ నిర్మాణాలు, మొత్తం ఎనిమిది స్లాబ్లకు గాను ముందు వైపు ఆరు స్లాబ్ లు వెనక వైపు 7 స్లాబ్ లు పూర్తి అయ్యాయని అన్నారు. వర్క్ చార్ట్ ప్రకారం జరుగుతున్న పనుల వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్.ఈ లు లింగారెడ్డి,సత్యనారాయణ,ఈ.ఈ లు శశిధర్, శ్రీనివాస్, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, ఆర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని, పలువురు కన్సల్టెన్సీ, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.