Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- అర్బన్ఫారెస్టు పార్కులపై యాప్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లోని అటవీభూములను ఒక్కోచోట ఒక్కో ప్రత్యేకతతో అర్బన్ఫారెస్టులను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో అర్బన్ ఫారెస్టు పార్కులపై సమగ్ర సమాచారంతో అటవీ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసికోల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్టు పార్కుల సమగ్ర సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పారు. హెచ్ఎమ్డీఏ పరిధిలోని 39 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించిన సమాచారాన్ని అందులో పొందుపర్చామని తెలిపారు. రెండో దశలో మరిన్ని పార్కుల సమాచారాన్ని నిక్షిప్తం చేస్తామని చెప్పారు. సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ చొరవతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను పామ్టెన్ సంస్థ రూపొందించిందని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. కుటుంబాలతో పాటు సరదాగా అర్బన్ ఫారెస్టు పార్కులో సేద తీరేందుకు వచ్చే పట్టణ వాసులకు వాటి సమచారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ యాప్ ను రూపొందించామని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, (పీసీసీఎఫ్) ఆర్. శోభ, పీసీసీఎఫ్ (సోషల్ఫారెస్ట్రీ) ఆర్.ఎం.డోబ్రియల్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.