Authorization
Fri April 11, 2025 08:30:52 am
- బదిలీల అనంతర ప్రమోషన్లతో తీవ్రంగా నష్టపోతాం
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 40 మంది హెచ్ఎంలకు అన్యాయం
- స్థానికతను కోల్పోతామని ఆందోళన
- హైదరాబాద్ డీఎస్ఈ ఆఫీసుకు హెచ్ఎంల క్యూ
- లోనికి రానివ్వకుండా గేట్ లాక్ చేయడంపై ఆగ్రహం
- ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వారంతా 22 ఏండ్లుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్న సర్కార్ బడుల టీచర్లు. 15 ఏండ్ల సర్వీస్ తర్వాత హెచ్ఎంలుగా ప్రమోషన్ పొందారు. అంతవరకు బాగానే ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆగమాగం అవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే రిటైరవుతామనుకున్న వారందరూ ఇప్పుడు చెల్లా చెదురైపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బదిలీల్లో భాగంగా ప్రాథమికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏదో ఒక ప్రాంతానికే వెళ్తున్నా.. ఆ తర్వాత వచ్చే ప్రమోషన్లతో స్థానికతనే కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారం ఉదయం 9.30 గంటల్లోగా బదిలీ అయిన స్కూళ్లలో రిపోర్ట్ చేయాలని కలెక్టర్ల నుంచి వాట్సాప్ సందేశాలు రావడంతో జిల్లాలోని టీచర్లంతా హడావుడిగా కొత్త స్కూళ్లకు వెళ్లిపోయారు. కానీ హెచ్ఎంల పరిస్థితి దారుణంగా మారింది. మల్టీజోన్ విధానంతో స్థానికతనే కోల్పోయే ప్రమాదం వాటిల్లిందని బాధపడుతున్నారు.
మల్టీజోన్ 2 నుంచి 1లోకి ఎందుకు..?
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత జోనల్ విధానాన్ని మారుస్తూ.. ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లను రూపొందించి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టింది. కొత్త జోనల్ విధానంలో ఉద్యోగుల విభజన చేపట్టేందుకు 317 జీవో ఇచ్చింది. ఈ నెలాఖరులోగా విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ ఉత్తర్వుల్లో ఉద్యోగుల విభజన ఉద్యోగి స్థానికత ఆధారంగా కాకుండా.. ఆ ఉద్యోగి ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులోని సర్వీస్ ఆధారంగా పూర్వపు జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు వారి నుంచి ఆప్షన్స్ తీసుకొని అలాట్మెంట్ చేయాలని నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటైన జోన్ల ప్రకారం మెదక్, సిద్దిపేట జిల్లాలు మూడో జోన్లో ఉండగా.. సంగారెడ్డి జిల్లా ఆరో జోన్లో ఉంది. మల్టీ జోనల్ ప్రకారం మెదక్, సిద్దిపేట జిల్లాలో ఒకటో జోన్లో ఉండగా.. సంగారెడ్డి జిల్లా రెండో జోన్లో ఉంది. ఈ ప్రకారం సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వారు ప్రస్తుతం మెదక్, సిద్దిపేట జిల్లాలకు బదిలీ అయినా.. ఆ తర్వాత జరిగే ప్రమోషన్లలో మల్టీజోన్ 1 కింద ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావచ్చు. దాంతో స్థానికతను కోల్పోతామని ఉమ్మడి మెదక్ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.
హెడ్ మాస్టర్లకు మల్టీజోన్ ఎందుకు..?-నాగరాజు, హెడ్ మాస్టర్
పాత మెదక్ జిల్లా ప్రకారం ప్రస్తుతం బదిలీలు అంటున్నప్పటికీ.. హెడ్ మాస్టర్లు భవిష్యత్తులో ఇతర జిల్లాలకు వెళ్లక తప్పదు. హెడ్ మాస్టర్లకు మల్టీజోన్ వద్దంటూనే ఉన్నాం. కొంతమంది ఒత్తిడితోనే ఉమ్మడి మెదక్ జిల్లాలోని 40 మంది హెచ్ఎంలను బలిచేస్తున్నారు. రాత్రికి రాత్రి ఉపాధ్యాయులకు ఉత్తర్వులిచ్చారు. హెచ్ఎంలను ఆప్షన్లు పెట్టుకోమన్నారు. సంగారెడ్డి జిల్లా వారిని మల్టీ జోన్ 1 కు వేయడం అన్యాయం. పాత మెదక్ జిల్లాకు బదిలీ అయినప్పటికీ.. భవిష్యత్‌లో సిరిసిల్ల, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు వెళ్లకతప్పదు. దాంతో స్థానికతను పూర్తిగా కోల్పోతాం. ఇదే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు. గేట్ లాక్ చేసి.. బయటినుంచి అటెండర్‌కు దరఖాస్తులు ఇచ్చుకోమ్మన్నారు. నేను స్కూల్ అసిస్టెంట్‌గా 2000లో ఉద్యోగం ప్రారంభించా.. 2014లో హెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడేమో మల్టీజోన్ పేరుతో జిల్లా నుంచి పంపిచేస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.
మా ఇష్టానికి వ్యతిరేకంగా బదిలీలు - వాహిద్ పాషా, హెడ్ మాస్టర్
జిల్లాలో ఎన్ని హెచ్ఎం పోస్టులు మంజూరు అయ్యాయో.. ఎన్ని ఖాళీగా ఉన్నాయో బయటపెట్టకుండా రహస్యంగా బదిలీల ప్రక్రియ చేపట్టారు. సీనియారిటీ ప్రకారం తీసుకుంటే చాలామందికి న్యాయం జరుగుతుంది. దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు పంపితే ఎలా..? సంగారెడ్డి నుంచి 40 మందిని మెదక్, సిద్దిపేటకు పంపుతామన్నారు. ఆ తర్వాత ప్రమోషన్లలో భాగంగా అక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. ఇప్పుడే ఆప్షన్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. సీనియారిటీ లిస్ట్‌ను ఎనలైజ్ చేసుకునేందుకు సమయం కూడా ఇవ్వలేదు. మా ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం.
ఏ ప్రాతిపదికన బదిలీలు చేస్తున్నారు - సోమశేఖర్, టీపీటీఎఫ్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఉపాధ్యాయుల బదిలీలకు స్పష్టమైన విధానమేదీ లేదు. ఒక చోటి నుంచి మరోచోటికి బదిలీ అయి జాయిన్ కావాలంటే.. ముందు పనిచేసిన చోటి నుంచి రిలీవ్ కావాలి కదా. అలా కాకుండా రాత్రికిరాత్రే ఉత్తర్వులెలా ఇస్తారు. వాట్సాప్ సందేశాలు చూపించి స్కూళ్లలో జాయిన్ కావాలనడం సరైనపద్దతి కాదు. ఇంకా స్పౌస్ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి కానేలేదు. హెడ్ మాస్టర్ల బదిలీలపై గందరగోళం నెలకొంది.
మల్టీజోన్తో హెచ్ఎంలకు ఇబ్బందులే - సాయిలు, టీఎస్ యూటీఎఫ్, సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి
మల్టీజోన్ విధానమే వద్దన్నాక.. ఎందుకు హెచ్‌ఎంలపై రుద్దుతున్నారు. ప్రస్తుతం తెచ్చిన మల్టీజోన్లలో ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను కలిపేశారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా మల్టీజోన్ 2లో ఉంది. ఈ జిల్లా వారిని మల్టీ జోన్ వన్‌లోకి బదిలీ చేయడమంటే.. దక్షిణ తెలంగాణ వారిని భవిష్యత్తులో ఉత్తర తెలంగాణకు తరలించడమే. దాంతో స్థానికత కోల్పోయి.. వారి పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. హేతుబద్దంగా లేని బదిలీ ప్రక్రియను వెంటనే రద్దుచేయాలి.