Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌరెత్తిన నిరసనలు
- ఎమ్మెల్యే తనయుడ్నిఏ1గా చేర్చి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్
- విపక్షాల పాల్వంచ, కొత్తగూడెం బంద్ సక్సెస్
- టీఆర్ఎస్ నుంచి రాఘవ సస్పెండ్
నవతెలంగాణ-కొత్తగూడెం
నాగరామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు వనమా రాఘవను తక్షణం అరెస్టు చేసి, ఈ కేసులో ఏ2 నిందితునిగా ఉన్న అతన్ని ఏ1గా చేర్చడంతో పాటు కఠినంగా శిక్షించాలని విపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కొత్తగూడెం, పాల్వంచ బంద్ విజయవంతం అయింది. కాగా, విపక్షాల నిరసన, బాధితుని సెల్ఫీ వీడియోతో టీఆర్ఎస్ నుంచి రాఘవను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ నేతలు ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ ఎంఎల్, ఎన్డీ, బీజేపీ, బీఎస్పీ, డీడీపీ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఈ బంద్ కొనసాగింది. పట్టణంలోని కొంతమంది రాజకీయ నాయకులను తెల్లవారుజామునే పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఉదయం నుండే ఆయాపార్టీల కార్యకర్తలు, నాయకులు రోడ్డుమీదకు చేరుకున్నారు. షాపులు బంద్ చేయించారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్, పోస్టాఫీస్ సెంటర్లో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్, వామపక్షాల నేతలను అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటాయి. ఖమ్మంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాఘవ దిష్టిబొమ్మ దహనం చేశారు. 'జనారణ్యంలో మానవ మృగం వనమా'ను కఠినంగా శిక్షించాలని పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో సీపీఐ(ఎంఎల్), సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలోనూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాగరామకృష్ణ కుటుంబానికి నివాళి అర్పిస్తూ.. రాఘవను కఠినంగా శిక్షించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తండ్రి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని రాఘవ అరాచకాలకు పాల్పడుతున్నాడన్నారు. ప్రభుత్వ అండదండలతోనే రాఘవ భూదందాలు, సెటిల్మెంట్లు, ఇంకా అనేక అరచకాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. అతనిపై రౌడీషీట్, పీడీయాక్ట్ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వనమా రాఘవ అక్రమ సంపాదనపై సీబీఐ ఎంక్వైరీ నిర్వహించి ఆస్తులను స్వాధీనం చేసుకొని బాధిత కుటుంబాలను ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరారు.
టీఆర్ఎస్ నుంచి రాఘవ సస్పెండ్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారనీ, తక్షణం ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ రాసిన లేఖ, సెల్ఫీ వీడియోలో రాఘవపై తీవ్ర ఆరోపణలున్నాయి. కాగా, ఈ ఘటనపై ఐదు రోజుల తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్పందించడం గమనార్హం. ఈ నేఫథ్యంలో రాఘవకు పార్టీ అండ సంమృద్ధిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాఘవకు పోలీసుల నోటీసులు
ఘటన జరిగి నాలుగురోజులవుతున్నా రాఘవను అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యంగా పలువురు విమర్శిస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాఘవకు నోటీసులు జారీ చేశారు. గతంలో పాల్వంచ ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య కేసులో ముందుస్తు బెయిల్ పొందిన రాఘవను శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల్లోపు లొంగిపోవాలని ఈ నోటీసుల సారాంశం.
ఆ సమయంలోగా కొత్తగూడెం ఏఎస్పీ శబరీష్ ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు. దీన్నిబట్టి ముందుస్తు బెయిల్‌ను రద్దు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు అంచనా. కాగా, రాఘవ భాగస్వాములుగా చెప్పుకోబడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన వీరు అనేక సెటిల్మెంట్లలో రాఘవ భాగస్వాములుగా ఉన్నట్టు చెబుతున్నారు. రామకృష్ణ పంచాయితీ జరిగినప్పుడు కూడా వీరు అక్కడే ఉన్నట్టు సమాచారం.