Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు సీఐటీయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ కార్మికులకు, సిబ్బందికి వేతనాలు పెంచాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో కమిషనర్ శరత్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రజాప్రతినిధులు, ఉద్యోగులందరికీ వేతనాలు పెంచి పంచాయతీ సిబ్బందికి పెంచకపోవడం అన్యాయమన్నారు. వివిధ శాఖల్లో పనిచేసే వారికి 30 శాతం వేతనాలు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. రెండేండ్లుగా కరోనా విపత్తులో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం దారుణమని విమర్శించారు.