Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన కొత్త జిల్లా, జోన్, మల్టీ జోన్ వారీగా కేటాయింపులు
- 22,418 మంది టీచర్లు, 13,760 మంది ఎంప్లాయీస్‌కు స్థానచలనం
- జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగులకు నేడు పోస్టింగులు
- కలెక్టర్లు, అధికారులకు సీఎస్ ధన్యవాదాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపుల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 22,418 మంది ఉపాధ్యాయులు, 13,760 మంది ఉద్యోగులు కలిపి 36,178 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో 21,800 ఉపాధ్యాయులు, 13760 మంది ఉద్యోగులు ఇప్పటికే కొత్త జిల్లాల్లోని పోస్టింగుల్లో చేరారు. మిగిలిన 618 మంది ఉపాధ్యాయులు కేటాయించిన పోస్టింగుల్లో చేరనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 అనుగుణంగా కొత్త జిల్లాలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. తక్కువ సమయంలో ఈ విభజన ప్రక్రియ పూర్తి కావడం గొప్ప ముందడుగు అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. జోనల్, మల్టీ జోనల్ క్యాడర్ ఉద్యోగుల కేటాయింపులు పూర్తయ్యాయని వివరించారు. శనివారం నాటికి పోస్టింగులు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగుల విభజనను పారదర్శకంగా నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తిచేసిన జిల్లాల కలెక్టర్లు, శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, ఇతర అధికారులకు సీఎస్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు. రాష్ట్రపతి ఉత్వర్వులు-2018 ప్రకారం తెలంగాణ స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను తెచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 6న జీవోనెంబర్ 317ను జారీ చేసింది. ఉద్యోగుల సీనియార్టీ ప్రకారమే కేటాయింపులు చేపట్టాలని నిర్ణయించింది. స్థానికతను విస్మరించడంతో ఈ జీవోపై పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయినా ప్రభుత్వం అలాగే ముందుకెళ్లింది.
భార్యాభర్తల్లో అసంతృప్తి
నూతన జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లకు కేటాయించిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఇంకా ఆందోళన నెలకొన్నది. ఒకే జిల్లాకు రాని భార్యాభర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది భార్యాభర్తలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు మారుమూల ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి.