Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిపుణుల కమిటీ సిఫారసులెంటో చెప్పాలి : హైకోర్టు విచారణ వాయిదా
హైదరాబాద్ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయనీ, ఒమిక్రాన్ వైరస్ కేసులూ ఉన్నాయనీ, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కరోనా టెస్ట్‌లు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. తక్కువగా టెస్ట్‌లు ఉన్నాయని, టెస్టులు పెంచితే వైరస్ ఉన్న వాళ్లను గుర్తించడం సులభమై వ్యాప్తిని అరికట్టేందుకు వీలౌతుందని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలనీ, లేనిపక్షంలో పరిణామాలు తీవ్రమవుతాయని చెప్పింది. ప్రభుత్వం గతంలో విధించిన నిపుణుల కమిటీ ఏమి సిఫారసులు చేసిందో వాటిని ఏమేరకు అమలు చేసిందో తదుపరి విచారణలో చెప్పాలని ఆదేశించింది. కరోనాపై దాఖలైన వేరువేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను శుక్రవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. నీలోఫర్ ఒక్కటే పిల్లల ప్రత్యేక హాస్పటల్ ఉందని, మరొకటి ఏర్పాటు చేయాలని చెప్పింది. సినిమా హాల్స్, మాల్స్, సంతలు, మార్కెట్లు, గ్రామాల్లో వారాంతపు సంతల్లో కరోనా మార్గదర్శకాలు అమలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆదిలోనే అప్రమత్తం అయితే పరిణామాలు అదుపులో ఉంటాయని, గత అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టు, రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించింది. మతాలు, కులాలు, రాజకీయ పార్టీలకతీతంగా చర్యలు ఉండాలని చెప్పింది. జన సమీకరణలు కాకుండా చేయాలని చెప్పింది. మాస్కులు ధరించేలా చేయాలని, వ్యక్తుల మధ్య దూరం ఉండేలా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సినేషన్ గురించి ప్రచారం చేయాలంది. విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
నిజామాబాద్ ఎంపీకి ఊరట
సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ బొమ్మతో కార్టూన్ పోస్ట్ చేయడంపై బంజారాహిల్స్ పోలీసులు పెట్టిన కేసులో నిందితుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 7 వరకు చర్యలేమీ తీసుకోరాదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదేశాలిచ్చారు. ఎంపీగా ఉన్న వ్యక్తి ఆ విధమైన పోస్టింగ్స్ పెట్టడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.ఉన్నత స్థాయి వ్యక్తులపై పోస్టింగ్ పెట్టబోమని ఆయన లాయర్ హామీ ఇచ్చారు. ఇక ముందు ఆ తరహా పోస్టింగ్ పెట్టరాదని హైకోర్టు చెప్పింది పోలీసులు కౌంటర్ వేయాలని నోటీసులు ఇచ్చింది. విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.
శోభ విడుదలకు ఉత్తర్వులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కరీంనగర్లో చేసిన జనజాగరణ దీక్షకు మద్దతు ఇచ్చిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. రూ..25 వేలు పూచీకత్తు సమర్పించిన తర్వాత ఆమెను విడుదల చేయాలని ఆదేశించింది. రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని శోభ వేసిన రిట్‌ను శుక్రవారం జస్టిస్ ఉజ్జల్‌భూయాన్ విచారించారు. బండి సంజ రు వేసిన కేసుతో కలిపి ఫిబ్రవరి 7న విచారణ చేస్తామని చెప్పారు.
సంక్రాంతి సెలవులు
ఈ నెల 10 నుంచి ఈనెల 16 వరకు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈనెల 17 నుంచి తిరిగి ప్రారంభం అవుతుంది.్లో అత్యవసరమైన కేసులను ఈనెల 10న దాఖలు చేస్తే వాటిని 12న జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ పి.మాధవీదేవి విచారిస్తారని రిజిస్ట్రార్ తెలిపారు. బెయిల్ పిటిషన్లను నేరుగా దాఖలు చేసుకోవడానికి వీల్లేదని, జిల్లా కోర్టులు కొట్టివేసిన తర్వాత ఆ ఆదేశాలను జతచేస్తూ మాత్రమే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవాలని, సర్వీసు వివాదాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి సంబంధించిన వివాదాలపై పిటిషన్లు దాఖలు చేసుకోవడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.