Authorization
Sat April 12, 2025 02:33:58 am
- దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు కుట్ర
- స్వాతంత్రం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోరాడారు
- ఆ పోరాటంలో కాషాయదళం పాత్ర లేదు : ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలో డి రాజా వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాగే అధికారంలో కొనసాగితే దేశాన్ని ఫాసిస్టు దేశంగా, మతరాజ్యంగా మార్చే ప్రమాదం పొంచి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు. అవి దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న ఆర్ఎస్ఎస్ అసలైన దేశ వ్యతిరేకి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ తమ చేతిలో లేదంటూ ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ చెబుతున్నారనీ, దాని అవసరం లేకుండా ప్రత్యక్షంగానే ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. మతతత్వ ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు యువత భగత్‌సింగ్, చేగువేరా వంటి విప్లవ కిశోరాల్లాగా మారి పోరాడాలని పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్)16వ జాతీయ మహాసభలు శుక్రవారం హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్, (వేముల రోహిత్ నగర్)లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షులు అఫ్తాబ్ ఆలం ఖాన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు సీపీఐ రాజ్యసభ సభ్యులు బినొరు విశ్వం, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీ రాజా, ఏఐవైఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి సందోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై హాజరయ్యారు. ఈసందర్భంగా రాజా మాట్లాడుతూ పూర్వం బ్రిటీష్ దేశానికి భారతదేశం వలస దేశంగా ఉండేదని చెప్పారు. వాటికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని గుర్తు చేశారు. సంపూర్ణ స్వరాజ్యం కావాలనీ, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని మొట్టమొదట నినదించిందని కమ్యూనిస్టులేనన్నారు. ఎంతో మంది కమ్యూనిస్టులు తమ ప్రాణాలను త్యాగం చేశారనీ, జైళ్ళలో చిత్రహింసలు పాలయ్యారనీ, అలాంటి పోరాటాలతో దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని చెప్పారు. ఇప్పుడు గొప్ప దేశభక్తులమని చెప్పుకునే ఆర్ఎస్ఎస్, బీజేపీ నాటి స్వాతంత్రపోరాటంలో ఎక్కడున్నారని నిలదీశారు. మోడీ అధికారంలోకి వచ్చాక బడాకార్పొరేట్ సంస్థల కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అచ్చే దిన్ వచ్చిందంటే అది అదానీ, అంబానీలకేనని ఎద్దేవా చేశారు.దేశ సంపద, ఆస్తులను ప్రయివేటీకరిస్తే ప్రజలకేం మిగలుతుందని ప్రశ్నించారు. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రజాస్వామ్యం, లౌకికవాదం, పార్లమెంటరీ విధానాలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని విమర్శించారు. పౌరుల హక్కులను, రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటున్నదని చెప్పారు. ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెట్టి, మత విభజనకు పూనుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిపాటు పోరాడిన రైతులు.. మోడీ ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారని అన్నారు. చట్టాలను వెనక్కి తీసుకునేలా వారు ఉద్యమించారని ప్రశంసించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నుంచి దేశాన్ని రక్షించేందుకు యువత సైద్ధాంతిక, రాజకీయ పోరాటాలు చేయాలని సూచించారు. ఏఐవైఎఫ్ తనకు అమ్మ ఒడి లాంటిదనీ, తాను ఈ సంఘానికి తమిళనాడు కార్యదర్శిగా,జాతీయ ప్రధాన కార్యదర్శి పని చేసి,నేడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినఅ ందుకు గర్వపడుతున్నట్టు తెలిపారు. మహాస భకు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం అనిల్ కుమార్ స్వాగతం పలుకగా, అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ వందన సమర్పణ చేశారు.