Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం డైరీ ఆవిష్కరణలో అశోక్ ధావలే, హన్నన్‌మొల్ల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంటలకు కనీస మద్దతు ధరల చట్టం సాధించే వరకు ఐక్యంగా పోరాడుతామని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్‌మొల్ల తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతుసంఘం రూపొందించిన 'చైతన్యసేద్యం-2022' డైరీని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజ్ఞూ కష్ణన్, చైతన్యసేద్యం పత్రిక ఎడిటర్ ప్రొఫెసర్ అరిబండి ప్రసాద్‌రావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.జంగారెడ్డి, టి.సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌లతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో జాతీయోద్యమం తర్వాత మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటం జరిగిందనీ, ఫలితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకున్నదని తెలిపారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం సాధించడమే లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మోడీ హామీ ఇచ్చారనీ, ఆ తర్వాత విస్మరించారని విమర్శించారు. దేశంలో ఏటా 10 నుంచి 13 వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రయివేటు శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా రైతులందరూ నిలబడాలని పిలుపునిచ్చారు. తద్వారా కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలని సూచించారు. కేంద్రంలోని మోడీ సర్కారు... ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల రైతులతోపాటు సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజానీకంపై మోయలేని భారం పడుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక మైత్రితో అన్ని తరగతుల ప్రజలను కలుపుకుని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమరశీలంగా, ఐక్యంగా ఉద్యమాలను నిర్వహించారని వారు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు.