Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పాలకవర్గాలపై బెంగాల్ ప్రజానీకంలో నెలకొన్న భ్రమలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. నిదానంగా ప్రజానీకం వాస్తవా లను గుర్తిస్తున్నారు. టీఎంసీ, బీజేపీ రెండూ ఒకతానులోని ముక్కలనే నిజం వారికి క్రమేణా అర్ధమవుతున్నది. ఇటీవల జరిగిన కోల్కత్తా నగరపాలక ఎన్నికల్లో అధికార టీఎంసీ పెద్ద ఎత్తున హింసాకాండకు దిగి, రిగ్గింగ్‌కు పాల్పడింది. అయినా, వామపక్షాలకు 12శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఉంటే ఇది 20శాతం దాటేదని స్వతంత్ర పరిశీలకుల అంచనా. వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు చేస్తున్న ప్రచా రానికి సానుకూల స్పందన లభిస్తున్నదనటానికి ఇదో నిదర్శనం' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పశ్చిమబెంగాల్ నేత సుజన్ చక్రవర్తి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు తున్న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన నవతెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ క్లుప్తంగా..
బెంగాల్లో ప్రజాఉద్యమాలు ఎలా జరుగుతున్నాయి? అణచివేత చర్యలు ఎలా ఉన్నాయి?
వివిధ సమస్యలపై బెంగాల్ ప్రజానీకం గళం విప్పుతూనే ఉన్నారు. అయితే, అధికారంలో ఉన్న టీఎంసీ పెద్ద ఎత్తున అణచివేతకు దిగుతున్నది. రాష్ట్ర పోలీసులతో పాటు, తృణమూల్ గూండాలు దాడులకు దిగుతున్నారు. త్రిపురలో బీజేపీ ఏ విధంగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని హింసాకాండకు దిగుతోందో, బెంగాల్లో టీఎంసీ కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నది.
కోల్కత్తా నగర పాలక సంస్థ ఎన్నికలే దీనికి నిదర్శనం. కొన్ని డివిజన్లలో 97శాతం ఓట్లు టీఎంసీకి పోల్అయ్యాయి. అత్యధిక చోట్ల 80 నుంచి 87 శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. పోలింగ్‌బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను కిడ్నాప్ చేయడం, ప్రజలకు ఓట్లు వేసే అవకాశం ఇవ్వకపోవడం వంటి చర్యలకు టీఎంసీ పాల్పడింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే స్థితి.
కోల్కత్తా నగరపాలక సంస్థ ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల శాతం పెరిగింది కదా...!
ఈ ఎన్నికల్లో 12శాతం ఓట్లు వచ్చాయి. ఇది గణనీయమైన పెరుగుదలే. అనేక డివిజన్లలో టీఎంసీ తరువాత రెండవ స్థానం లో నిలిచాం. ఇంత హింసాకాండలోనూ ఈఓటింగ్ను సాధించ డం పట్ల స్థానిక మీడియా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. నిజానికి ఈ ఎన్నికల్లో 50శాతంకు పైగా ఓట్లను టీఎంసీ రిగ్గింగ్ చేసింది. ఆ ఓట్లు కూడా పోల్ అయిఉంటే వామపక్షాలకు పోల్ అయిన ఓట్లు మరిన్ని పెరిగి ఉండేవని భావిస్తున్నాం. ఈ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీపీఐ(ఎం) యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు దీనిని ఆహ్వానించారు.
బీజేపీ ప్రభావం ఎలా ఉంది?
మతాన్ని అడ్డుపెట్టుకుని, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా బలాన్ని పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. దీనికి తృణమూల్ కాంగ్రెస్ కూడా సహకరిస్తోంది. దీంతో ఆ పార్టీ రాష్ట్రంలో రెండవ స్థానానికి ఎగబాకింది. అయితే, ఇది ఎక్కువ రోజులు సాగదు. బెంగాల్ సాంస్కృతిక వారసత్వం ఇది కాదు. దీంతోపాటు మోడీ రైతాంగ, కార్మిక వ్యతిరేక చర్యలను ప్రజలు గుర్తించారు.
మతోన్మాదం పట్ల టీఎంసీ వైఖరి ఎలా ఉంది?
టీఎంసీ కూడా బీజేపీతో పోటీ పడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పెద్ద హిందువునని చెప్పుకుంటున్నారు. బాహాటంగానే సంతృప్తి పరిచే చర్యలకు దిగుతున్నారు. ఇటీవల కాలంలో బహిరంగ సభ ల్లో ఆమె ప్రసంగాల ను కూడా హిందూ నినాదాలతోనే ప్రారంభిస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య! టీఎంసీ,బీజేపీలు పరస్పర పూరకాలని, ఒకదానితో ఒకటి సహకరించుకుం టాయని వామపక్షాలు ఇంతకాలం చెబుతూ వచ్చిన విషయం నిజమైంది.
వామపక్షాలు ప్రజలను ఎలా చైతన్యపరుస్తున్నాయి?
మేం నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. వారి నిత్య జీవిత సమస్యలపై పనిచేస్తున్నాం. ప్రజలను విభజించే బీజేపీ విధానాలు, దానికి సహకరించే టీఎంసీ తీరును వారికి వివరించాం. రైతాంగ సమస్యల నుంచి కార్మికులు, యువకులు, మహిళలు, విద్మార్థులు ఇలా అన్ని తరగతుల వారిని కదిలిస్తున్నాం. జీవితం.. విద్య, వైద్యం అంశాలపై ప్రజలను సంఘటితం చేస్తున్నాం. వారి హక్కులను గుర్తు చేస్తున్నాం. పోరాటానికి సిద్దం కావాలంటూ పిలుపునిస్తున్నాం. ఈ పిలుపునకు సానుకూల స్పందన లభిస్తోంది.