Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు
- మూడోవేవ్‌ను సమర్ధంగా ఎదుర్కొందాం
- తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదాం
- 15-18 ఏండ్ల వారి వ్యాక్సినేషన్ వేగం పెంచాలి
- అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో ఐసోలేషన్, పరీక్ష కిట్లు
- జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రులకెళ్లి అప్పులపాలు కావొద్దనీ, ప్రభుత్వాస్పత్రుల్లోని మెరుగైన వైద్య సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలనీ, తెలంగాణ వైద్య సేవలను దేశానికే ఆదర్శంగా నిలిపేలా పనిచేయాలని ఆదేశించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదం తక్కువే అని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీఓలు, ఆశా కార్యకర్తలతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలనీ, రెండో డోసు లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. 15 నుంచి 18 ఏండ్ల వారికి టీకా కార్యక్రమాన్ని మరింత వేగం చేయాలని సూచించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు ఇండ్లకు వెళ్తారనీ, వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్లు అందించాలని చెప్పారు. జనవరి 10 నుంచి 60 ఏండ్లకు పైబడిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమానికి సిద్ధం కావాలని ఆదేశించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి మొదట బూస్టర్ డోస్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆశాల పరిధిలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారు ఒక్కరు కూడా ఉండకూడదనే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆరోగ్య సూచిల్లో దేశంలోనే మన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచిందనీ, ఇందులో ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా ఆశాల కృషి దాగుం దని మంత్రి కొనియాడారు. వచ్చే రెండేండ్లలో మొదటి స్థానంలో నిలవాలనే లక్ష్యంతో సమిష్టిగా కలిసి పనిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో కోటి హోంఐసోలేషన్ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లను అన్ని జిల్లాల పీహెచ్సీ, సబ్‌సెంటర్ల స్థాయికి సరఫరా చేశామని మంత్రి చెప్పారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలన్నారు. సాధారణ లక్షణాలుంటే మందుల కిట్లు ఇచ్చి హోం ఐసోలేషన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, వారి ఆరోగ్యస్థితిని ఆశాలు ప్రతి రోజూ పరిశీలిం చాలనీ, అవసరమైతే సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించా లని ఆదేశించారు. పంచాయతీ, మున్సిపల్ సహా స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు అవగాహన పెంచాలన్నారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేయాలన్నారు. ఇదే సమయంలో అన్ని ఆసుపత్రుల్లో ఓపీ, గర్భిణులకు సేవలు, దీర్ఘకాలిక రోగులకుసేవలు అందించడంలో ఎలాంటి అంతరాయా లు కలగకుండా చూడాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.
ఆశాలకు పారితోషికం పెంచాం...
గత ప్రభుత్వాల హయాంలో పారితోషికాల పెంపు కోసం ఆశా కార్యక ర్తలు ధర్నాలు చేసేవారనీ, ఇందిరాపార్క్ వద్ద లాఠీ దెబ్బలు తిన్న ఘటనలూ ఉన్నాయని హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. గుర్రాలతో తొక్కించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఆశాల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మరోసారి 30శాతం పారితోషకం పెంచారన్నారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆశాలకు సూచించారు. వారందరి తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్టు మంత్రి తెలిపారు. పారితోషకం పెంపు సంతోషాన్ని ఆశా కార్యకర్తలు హరీశ్ రావుతో పంచుకున్నారు.