Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాల్వంచలో ఒకే కుటుంబం ఆత్మహత్య ఘటనకు బాధ్యుడైన వనమా రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ ఘటనకు నిరసనగా ఐద్వా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బాగ్లింగంపల్లి చౌరస్తాలో రాఘవేంద్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మల్లు లక్ష్మి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో మహిళలు, బాలికలపై హ్యతలు, హింసాకాండ, లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ సర్కారు పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. పాల్వంచలో వనమా రాఘవేంద్ర అధికారాన్ని అడ్డం పెట్టుకుని బరితెగించి, మహిళలపట్ల విచక్షణా రహితంగా వ్యవహరిస్తుంటే.. చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. గతంలో నమోదైన కేసుల్లో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్లనే తిరిగి అరాచకాలకు, గూండాయిజానికి తెగబడ్డాడని విమర్శించారు. చివరికి ఒకే కుటుంబంలో నలుగురి చావుకు కారణమయ్యాడని తెలిపారు. అతను వ్యవహరించిన తీరు బానిస సమాజాన్ని తలపించే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలంలోని సోమ్లా తండాకు చెందిన రజితపై మామ భూక్యా అచ్చా..తన కోర్కె తీర్చనందుకు లైంగిక దాడిచేయటంతోపాటు ఆమె శరీరాన్ని గాయపర్చటం అతడి క్రూరత్వానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి, మంచిర్యాల, మహబూబ్నగర్ జిల్లాల్లో ఆడపిల్లల పట్ల జరిగిన ఘటనలు పరిశీలిస్తే..మహిళలను విలాస వస్తువుగా ఎలా పరిగణిస్తున్నారో అర్థమవుతున్నదని చెప్పారు. ఈ ఘటనల పట్ల ప్రభుత్వం తగిన రీతిలో స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు బి హైమావతి, కె ఆశాలత, రాష్ట్ర నాయకురాలు శశికళ, యం స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.