Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇలాంటి సీఎంను నేనెక్కడా చూడలేదు
- విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు కరువు
- ప్రశ్నిస్తే, ఉద్యమిస్తే జైళ్లల్లో వేస్తారా?
- 2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం
- మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కేసీఆర్ పిరికివాడు. ఇలాంటి సీఎంను నేనెక్కడా చూడలేదు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు, కార్యక్రమాలకు బదులిచ్చే సంప్రదాయం కనిపించడం లేదు. ఉద్యమిస్తే, ప్రశ్నిస్తే అరెస్టు చేసి జైళ్లలో వేస్తున్నరు. జైల్లో పుట్టిన శ్రీకృష్ణుడు కంసుడిని వధించాడు. అన్యాయంగా బండిసంజరుని జైలులో వేస్తారా? నీ పాలన అంతం కాక తప్పదు. 2023లో తెలంగాణలో బీజేపీ దే అధికారం' అని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలోగల బీజేపీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ను స్వాగతిస్తూ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ...బండి సంజరు మాట వింటేనే కేసీఆర్‌కు భయం పుడుతున్నదనీ, కలలోనూ అతడే కనిపిస్తున్నాడని చెప్పా రు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తున్నదని విమర్శించారు. తాను నాలుగోసారి సీఎంగా కొనసాగుతున్నాననీ, కేసీఆర్‌లాగా సంస్కారహీనం గా ఎప్పుడూ వ్యవహరించలేదని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ విద్య ఏమయ్యాయి కేసీఆర్? అని ప్రశ్నించారు. తమ పార్టీ కార్యకర్తలపై లాఠీలు ఝలిపిస్తే.. చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీజేపీని మింగేయ డానికి బిర్యానీ కాదనీ, కడుపు చించుకుని బయటపడే పోరాటయోధుల పార్టీ అని చెప్పారు. కేసీఆర్‌ను మళ్లీ ఎలుకగా మార్చాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తూ సాధువు- ఎలుక కథను చెప్పారు. బండి సంజరు మాట్లాడుతూ.. కేసీఆర్‌కు కేసులు, అరెస్టులే ఆయుధంగా మారితే జైళ్లు, బందీఖానాలే బీజేపీకి అడ్డాగా మారతాయని హెచ్చరించారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఎమ్మెల్యే వనమా కొడుకును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించే వరకు పోరాడతామన్నారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ మాట్లాడుతూ..లోక్‌సభలో బండి సంజరు అరెస్టుపై లేవనెత్తుతామనీ, కరీంనగర్ సీపీని దోషిగా నిలబెడుతామని అన్నారు. తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈకార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె.లక్ష్మణ్, నేతలు వివేక్, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, భాషా, తదితరులు పాల్గొన్నారు.