Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీ.వో.317ను సవరించాలి
- టీజేఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పీఏల్ విశ్వేశ్వర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అధ్యక్షతన అశాస్త్రీయమైన 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ ప్రభుత్వం స్థానికతను పరిగణనలోకి తీసుకోకుండా, అన్ని సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్షంగా జీవో జారీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోలో స్పష్టత లోపించడంతో అన్యాయం జరిగిందనీ, దీంతో ఇప్పటికే ఆరుగురు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆర్థిక భారం పడని ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం, అధికారులు అవసరమైతే అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ అంశంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు.
అందరం కలిసి ప్రభుత్వం ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. ఇకనైనా ప్రభుత్వం ఆ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఆయా పార్టీలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ జీవో తప్పుల తడకగా ఉందని విమర్శించారు. స్వరాష్ట్రంలో స్థానికత కోసం పోరాడాల్సి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కనీస చర్చ లేకపోవడంతో తప్పులకు దారి తీసిందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల్లో సీనియర్లు, జూనియర్లు అనే విభజనకు దారి తీసిందన్నారు.
దీంతో 95 శాతం మంది ఉద్యోగులు స్థానికేతరులుగా మారిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్లను పట్టణ ప్రాంతాలకు, జూనియర్లను గ్రామీణ ప్రాంతాలకు కేటాయించడం వల్ల పాలనలో సమన్వయం లోపిస్తుందన్నారు. త్వరలో టీజేఏస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ పార్టీలతో కలిసి గవర్నర్ ని కలవనున్నామని తెలిపారు..ఈ సమావేశంలో అద్దంకి దయాకర్, అయోధ్య రెడ్డి, (కాంగ్రెస్), హర్షవర్ధన్ రెడ్డి (టీపీఆర్ టీయూ), జస్టిస్ చంద్ర కుమార్, భాస్కర్ (డీటీఎఫ్), ముత్యాల రవీందర్ (టీపీటీఎఫ్), అంబటి నాగయ్య - (తెలంగాణ విద్యావంతుల వేదిక ), పల్లె రవి ( సీనియర్ జర్నలిస్టు), . లక్ష్మణ్ ( తెలంగాణ కొత్త ఉద్యోగుల సంఘం), గోవర్థన్ - (న్యూ డెమోక్రసీ ), జ్యోత్స్న(టీడీపీ), అనిల్ (ఏజెన్సీ ప్రాంత ఉద్యోగుల సంఘం), . బైరి రమేష్, సలీంపాషా (టీజేఎస్) తదితరులు పాల్గొన్నారు.