Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు బలమైన పోరాటాలు చేపట్టాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ పిలుపునిచ్చారు. కార్పొరేట్లకనుకూలంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను రూపొందిస్తున్నదని విమర్శించారు. 'ప్రజలను కాపాడండి - దేశాన్ని రక్షించండి' నినాదంతో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో దేశ వ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు సంయుక్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయటంలో భాగంగా రాష్ట్ర, జిల్లా, ఏరియా ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త సదస్సులు, సంతకాల సేకరణ, జాతాలు, ప్రజా ప్రదర్శనలు నిర్వహించాలని అమర్జిత్కౌర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం (ఎస్.ఎన్.రెడ్డి భవన్)లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో జాతీయ కార్యదర్శి బి.వి.విజయలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాల్, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, కోశాధికారి పి.ప్రేంపావనిలతో కలిసి అమర్జిత్కౌర్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విధానం లేకుండా చేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం లేబర్కోడ్లు మార్చిందని ధ్వజమెత్తారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు పలు విభాగాల్లో పని చేస్తున్న స్కీమ్ వర్కర్ల కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి, విద్యా, వైద్య రంగాలకు అధిక నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డిజిల్ ధరలు పెరగటంతో నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కుతున్నాయన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు.