Authorization
Fri April 11, 2025 10:45:01 am
- హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల నిరసన
నవతెలంగాణ- హుజూరాబాద్
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 317ను తక్షణమే రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవోను అమలుపరచడం వల్ల ఉపాధ్యాయులు ఆప్షన్లు పెట్టుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్పౌజ్ల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతో భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు కేటాయించబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన వెనుకబడిన జిల్లాకు కేటాయించబడిన అనేకమంది జూనియర్లు స్థానికతను కోల్పోవడమే కాకుండా.. ఆయా జిల్లాల్లో రాబోయే15-20 సంవత్సరాల వరకు కొత్త ఖాళీలు ఏర్పడక అక్కడి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. జీవో 317ను రద్దు చేసి సమగ్రమైన, శాస్త్రీయమైన మార్గదర్శకాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపు జరపాలన్నారు. కొత్త మార్గదర్శకాలతో జీవో వచ్చే వరకు ఎక్కడ ఉద్యోగులను అక్కడే ఉంచాలని, స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.