Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌష్టికాహారం దొరకదు.. వైద్యం అందదు
- ఉమ్మడి ఆదిలాబాద్‌లోనే అత్యంత వెనుకబాటు
- 27.43శాతం మంది పేదరికంలో మగ్గుతున్న వైనం
- గణాంకాలతో వెల్లడించిన నిటి ఆయోగ్ నివేదిక
- ప్రత్యేక రాష్ట్రంలోనూ మారని జిల్లా స్థితిగతులు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పేరు అక్షర క్రమంలో ముందున్నా.. అభివృద్ధిలో వెనుకబడి ఉందని తరచూ వినిపించే మాట. ఇది అక్షరసత్యమని నిటి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. గ్రామీణ, పట్టణ పేదరికాన్ని వేర్వేరుగా వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 27.43శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నట్టు చెప్పింది. గ్రామీణ ప్రాంతంలో 32.68మంది, పట్టణ ప్రాంతాల్లో 12.58శాతం మంది పేదరికం అనుభవిస్తున్నట్టు విశదీకరించింది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని పాత పది జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత పేదరికం ఉన్నట్టు వెల్లడైంది. కాలం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతున్నా ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడటం లేదు. పల్లెల్లో అనేక మంది కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు. పట్టణాల్లోనూ అనేక మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండటం జీవన స్థితిగతులను తెలియజేస్తోంది.
పౌష్టికాహారం కరువు
ఇప్పటికీ పౌష్టికాహారం లభించక అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భిణులు, చిన్నారుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. 21.63శాతం మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో 28.49శాతం, పట్టణాల్లో 21.25శాతం మందిలో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. మరోపక్క శిశుమరణాల రేటు అధికంగా ఉండటం ఆందోళనకరం. 5నుంచి 18ఏండ్ల మధ్య పిల్లలకు సమయానికి వైద్య సేవలు లభించకపోవడంతోపాటు వివిధ వ్యాధుల బారినపడి 1.11శాతం మంది మరణిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఈ పరిస్థితి 1.06శాతం ఉండగా, పట్టణ ప్రాంతంలో 1.51శాతం మంది మరణిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వంట కోసం గ్యాస్ సిలిండర్లు కూడా అందుబాటులో లేని పేదలు ఉన్నారు. ఇప్పటకీ జిల్లాలో 9.64శాతం మంది పేదలు కట్టెల పొయ్యి, కిరోసిన్ పొయ్యిల మీదనే వంట చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో 9.64మంది, పట్టణాల్లో 7.46శాతం మంది ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజువారీ కనీస అవసరమైన తాగునీరు కూడా లభించడం లేదు. మిషన్ భగీరథ వంటి పథకం వచ్చినా పూర్తిస్థాయిలో జనాలకు చేరడం లేదు. ఇప్పటికీ 3.91శాతం కుటుంబాలు నీటి కోసం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. గ్రామీణంలో 3.69శాతం మంది, పట్టణాల్లో 5.52శాతం మంది బయటి నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. మరోపక్క అనేక కుటుంబాలు రాత్రివేళలో చీకట్లో మగ్గుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 41గ్రామాల్లో విద్యుత్తు సౌకర్యం లేకపోగా అటవీశాఖ అనుమతి లేనందున 0.65కుటుంబాలకు కరెంటు సౌకర్యం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతంలో 0.63శాతం, పట్టణాల్లో 0.86శాతం మంది ఈ సౌకర్యానికి దూరమవుతున్నారు. జిల్లాలో వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. వైద్యుల ఖాళీలు, సమయానికి వైద్యులు లేకపోవడం వంటి సమస్యల కారణంగా 6.67శాతం మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో 6.68శాతం, పట్టణాల్లో 7.49శాతం మంది వైద్య సేవలకు దూరమవుతున్నారు. అక్షరాస్యతలో వెనుకబడిన జిల్లాలో పదేండ్లు అంతకుమించి వయసు కలిగిన వారిలో 22.48శాతం మంది పాఠశాల విద్యకు దూరమయ్యారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 21.38శాతం, పట్టణాల్లో 30.74శాతం మంది ఉన్నట్టు వెల్లడైంది. స్వాతంత్య్రం వచ్చి 75ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ అనేక మంది పేదలకు ఉండటానికి కనీసం గూడు కూడా లేకుండా పోయింది. ఇలాంటి వారు జిల్లాలో 7.38శాతం మంది ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 7.77శాతం మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో 4.41శాతం మంది ఉండటం పేదరికం తీవ్రతను తెలియజేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక అక్షరాస్యతకు కూడా చాలా మంది దూరంగా ఉన్నారు. బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాలు లేని వారు జిల్లాలో 2.16శాతం మంది ఉన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 2.16శాతం మంది, పట్టణాల్లో 2.59శాతం మంది ఉన్నారు. ఇక జిల్లాలో గతం కంటే పారిశుధ్యం కొంత మెరుగుపడినా ఇప్పటికీ చాలా మందికి మరుగుదొడ్లు లేవు. 9.47శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో 9.48శాతం మంది, పట్ఠణ ప్రాంతంలో 9.38శాతం మంది ఉండటం గమనార్హం. ఇలా నిటి ఆయోగ్ నివేదిక వెల్లడించిన అంశాల ఆధారంగా జిల్లాలో పేదరికం దయనీయ స్థితిలో కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు, అధికారులు దృష్టిసారించి ఈ పరిస్థితిలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది.