Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జర్నలిస్టుల ఐక్యతతోనే మీడియా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన మీడియా స్వేచ్ఛ - ప్రజాస్వామ్య పరిరక్షణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, జర్నలిస్టుల సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు మాట్లాడారు. జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే మీడియా స్వేచ్ఛ అవసరమని అభిప్రాయపడ్డారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బలహీన పాలకులు ఉన్నప్పుడే దేశం బాగుపడిందని అభిప్రాయపడ్డారు. పత్రికా స్వేచ్ఛ, రక్షణ అనేది ప్రజలపైనే ఆధారపడి ఉందని సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే నియంతృత్వంపై గెలవగలుగుతామని తెలిపారు. నకిలీ వార్తల సాకుతో సత్యాన్ని దాచి పెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. జర్నలిస్టులను విభజించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పాలకుల ఉచ్చులో పడొద్దని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య కోరారు. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరముందనీ, ఐక్యంగా ఉన్నప్పుడే హక్కులు కాపాడుకోగలుగుతామని తెలిపారు. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలుగుతామని తెలిపారు. పాలకులను ప్రశ్నించే జర్నలిస్టులు తమను తాము కూడా ప్రశ్నించుకోగలగాలని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, జనం సాక్షి ఎడిటర్ రెహమాన్, జర్నలిస్ట్ రఘు, తీన్మార్ మల్లన్న, పల్లె రవికుమార్, కప్పర ప్రసాద్, అనంచిన్న వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. వేదిక ప్రధాన కార్యదర్శి సాధిక్ జర్నలిస్టుల అరెస్టులను ఖండిస్తూ తీర్మానాలను ప్రవేశపెట్టారు.