Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియుడే నిందితుడు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రియుడి చేతిలో యువతి దారుణకు హత్యకు గురైంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. మానకొండూరు మండలం చెంజర్ల శివార్లలోని గుట్టల్లో కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం శనివారం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ యువతిని వరలక్ష్మి(18)గా గుర్తించారు. ప్రియుడు అఖిల్ ఆమెను హత్యచేసినట్టు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మూడ్రోజుల కిందట హత్యచేసి గుట్టల్లో పడేసినట్టు ఒప్పుకున్నాడు. కాగా వరలక్ష్మి అదృశ్యంపై కుటుంబీకులు ఇప్పటికే తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన ఏదుల పోచవ్వ, బోయిని రాజవ్వలు వరలక్ష్మిని చేరదీసి పెంచి పెద్ద చేశారు. పొరండ్ల పక్క గ్రామానికి చెందిన అసోద అఖిల్, వరలక్ష్మి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతంలో ఓసారి వీరి ప్రేమ వ్యవహారం పెద్దల వరకూ వెళ్లడంతో వారు నిరాకరించారు.
ఆ తర్వాత అఖిల్‌కు ఇచ్చి పెండ్లి చేసేందుకు యువతి తల్లులిద్దరూ ఒప్పుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రేమికుడే వరలక్ష్మిని చిదిమేశాడు. అనాథ బిడ్డను పెంచి పెద్ద చేసిన తల్లులిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తనను పెండ్లి చేసుకోవాలని వరలక్ష్మి పట్టుబట్టడంతో ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న అఖిల్ లైంగికదాడి చేసి, హతమార్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రెండేండ్లుగా ప్రేమించిన అఖిల్ వరలక్ష్మిని కిరాతంగా హత్య చేయడం వెనుక కారాణాలు తెలియరాలేదు. ఈ హత్య కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.