Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయోత్సవ సభలో మున్సిపల్ జేఏసీ నేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కార్మికులకు కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని మున్సిపల్ జేఏసీ డిమాండ్ చేసింది. పోరాటాల ఫలితంగా జీవో నెంబర్ 4 విడుదలైన నేపథ్యంలో జేఏసీ నాయకులు జె.వెంకటేష్, కె.ఏసురత్నం సమన్వయకర్తలుగా శనివారం ఆన్లైన్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఖమర్ అలీ (సీఐటీయూ), జి.రామయ్య (ఐఎఫ్ టీయూ), స్వామి (ఐఎఫ్ టీయూ), సుంకశాల వెంకన్న (ఐఎన్టీయూసీ) అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 128 మున్సిపాల్టీల్లో పని చేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు కోసం గత ఆర్నెళ్ల నుంచి జేఏసీ పోరాడిందని గుర్తుచేశారు. ఫలితంగా జీవో జారీ అయినప్పటికీ అందులో వివిధ కేటగిరీల కార్మికులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కేటగిరీలకు వేతన వ్యత్యాసం లేకుండా గుంపగుత్తగా రూ.15,600గా వేతనం నిర్ణయించారని తప్పుపట్టారు. జీవో నెంబర్ 60 ప్రకారం ఆయా కేటగిరీలకు రూ.15,600, రూ.19,500, రూ.22,750 చెల్లించాల్సి ఉండగా కోతలు పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. వివిధ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం వారు పొందుతున్న వేతనంపై 30 శాతం పెంచి కొత్త వేతనాలు నిర్ణయించినా జీహెచ్ఎంసీ పరిధిలో కార్మికులకు మాత్రం పెంచలేదని విమర్శించారు. పెరిగిన వేతనాలను, బకాయిలతో సహా ఫిబ్రవరి మొదటి వారంలోగా చెల్లించాలనీ, జీహెచ్ఎంసీలోనూ వేతనాలు పెంచాలనీ, కార్మికుల పర్మినెంట్ కోసం చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ప్రవీణ్, తెలంగాణ ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శివబాబు, టీఎన్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.కె.బోసు, ఏఐయుటియుసీ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బాబురావు ఆ సమావేశంలో ప్రసంగించారు.
పంచాయతీరాజ్‌లో సిబ్బంది వేతనాలు పెంచండి
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
రాష్ట్రంలోని గ్రామపంచాయతీల్లో కార్మికులు, సిబ్బందిఅందరికీ వేతనాలు పెంచాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యేల జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. అన్ని శాఖలు, సంస్థలు,కార్పొరేషన్లలోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, క్యాజువల్ లేబర్, డైలీవేజ్ మొదలగు అన్ని క్యాటగిరీలలో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో పని చేస్తున్న వారికి వెంటనే వేతనాలు పెంచి, 2021 జూలై నుంచి ఇప్పించా లని కోరారు. ఈమేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.