Authorization
Sat April 12, 2025 02:19:31 am
- వంద ఎలుకలు తిన్న పిల్లి.. నేను శాఖాహారిని అన్నట్టున్నది
- ఏ రంగంలోనూ తెలంగాణకు మధ్యప్రదేశ్ పోటీ కాదు
- మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్
నవతెలంగాణ- సిద్దిపేట
మద్దతు ధర చెల్లించాలని.. రుణమాఫీ చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ జిల్లా మనుసోరులో 2017 మే 6న రైతులు ధర్నా చేస్తే.. ఆరుగురు రైతులను పిట్టల్లా కాల్చి చంపిన మీ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని మధ్యప్రదేశ్ సీఎం శివరాజసింగ్ చౌహాన్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన చౌహాన్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ కమిటీలో శనివారం విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చౌహాన్ మధ్యప్రదేశ్‌లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజలు చౌహాన్ మాటలు నమ్మబోరన్నారు. ఏ రంగంలో కూడా మధ్యప్రదేశ్ తెలంగాణకు పోటీ కాదన్నారు. మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం గురించి ప్రజలకు తెలపాలన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లాంటివి మీ రాష్ట్రంలో ఉన్నాయా అని ప్రశ్నించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహరి అన్నట్టుగా చౌహాన్ పరిస్థితి ఉన్నదన్నారు. దొడ్డి దారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కుని చౌహాన్ సీఎం అయ్యారని ఆరోపించారు. 317 జీవోను రద్దు చేయాలంటే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, మీ ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలనడం ఎంతవరకు సబబు అన్నారు అబాసుపాలు అవుతారు తప్ప ఉపయోగం ఉండదన్నారు. కేంద్రంలో 15 లక్షల 62 వేల 912 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు.