Authorization
Sat April 12, 2025 12:17:02 am
హైదరాబాద్ : కృష్ణ తనయుడు, మహేష్‌బాబు సోదరుడు, నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు (56) కన్నుమూశారు. గత కొంత కాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగానే తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలుసుకున్న కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు ఏఐజీ హాస్పిటల్‌కి తరలి వచ్చారు. 1974లో కష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' చిత్రంలో బాలనటుడిగా రమేష్‌బాబు తెరంగేట్రం చేశారు. 'దొంగలకు దొంగ', 'మనుషులు చేసిన దొంగలు', 'అన్నదమ్ముల సవాల్', 'నీడ', 'పాలు నీళ్ళు' వంటి తదితర చిత్రాల్లో పోషించిన పాత్రలతో బాలనటుడిగా మెప్పించారు. 1987లో వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సామ్రాట్' చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హీరోగా తొలి సినిమాతోనే అందర్నీ ఆకట్టుకున్నారు. తర్వాత జంధ్యాల దర్శకత్వంలో 'చిన్నికష్ణుడు', కోదండరామిరెడ్డి 'బజార్ రౌడీ' చిత్రాల్లో నటించారు. 'బజార్ రౌడీ' విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తండ్రి కష్ణ దర్శకత్వం వహించిన 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' చిత్రాల్లో రమేష్‌బాబు, మహేష్‌బాబు నటించడం ఓ విశేషమైతే, వీరితో కష్ణ కూడా యాక్ట్ చేయటం మరో విశేషం. నటుడిగా ఆయన నటించిన చివరి చిత్రం 'ఎన్కౌంటర్'. నటనకు దూరమైన రమేష్‌బాబు నిర్మాతగా మారి 2004లో కష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ని స్థాపించారు. ఈ బ్యానర్లో మహేష్‌బాబు, గుణశేఖర్ కాంబినేషన్లో 'అర్జున్' (2004), మహేష్‌బాబు, సురేందర్‌రెడ్డి కాంబోలో 'అతిథి' (2007), మహేష్‌బాబు, శ్రీనువైట్లతో 'దూకుడు', 'ఆగడు' వంటి తదితర చిత్రాలను నిర్మించి, భారీ చిత్రాల నిర్మాతగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగానూ మంచి పేరు సొంతం చేసుకున్నారు.