Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ / కుంటాల
పంటకు పెట్టిన పెట్టుబడి రాకపోవండతో అప్పులు తీర్చలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శనివారం వరంగల్, నిర్మల్ జిల్లాల్లో జరిగాయి. వివరాలిలా ఉన్నాయి.. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామానికి చెందిన మంచాల ఈశ్వరయ్య(46) తన కొద్దిపాటి భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. రెండేండ్ల నుంచి పంట దిగుబడి సరిగా రాకపోవడంతో సుమారు నాలుగు లక్షల వరకు అప్పు చేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పంటలు సరిగ్గా పండకపోవడంతో అప్పులెలా తీర్చాలని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. శుక్రవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. నిర్మల్ జిల్లా కుంటల మండలం అందకూర్ గ్రామానికి చెందిన రైతు కొండూరు గంగన్న(51)కు నాలుగెకరాల భూమి ఉంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. సాగుకు సుమారు రూ.7లక్షల వరకు అప్పులు చేశాడు. పంట దిగుబడి సరిగా రాక అప్పులు ఎలా తీర్చాలని ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో గ్రామ శివారులోని వేప చెట్టుకు ఉరేసుకున్నాడు. బ్యాంక్ రుణం రూ.2లక్షలుండగా, ప్రయివేట్ అప్పులు రూ.5లక్షలు ఉన్నాయి. కుమారుడు భోజన్నకు ఇటీవలే పెండ్లి నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 7న పెండ్లికి ముహూర్తం నిర్ణయించారు. భోజన్న లోకేశ్వరం మండలం కనకాపూర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ యజమాని మృతితో కుటుంబంలో విషాద నింపింది. రైతుకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య భోజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ రాందాస్ తెలిపారు.