Authorization
Fri April 11, 2025 12:36:48 pm
- రాఘవ అంగీకరించారన్నఏఎస్పీ రోహిత్ రాజ్
- 8 మంది నిందితులు.. ముగ్గురు అరెస్ట్
- నిందితులకు 14 రోజుల రిమాండ్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈనెల 3న కుటుంబం సహా ఆత్మహత్య చేసుకున్న నాగరామకృష్ణను బెదిరించినట్టు వనమా రాఘవేంద్రరావు అంగీకరించాడని పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడించారు. రాఘవను జిల్లా రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నీలిమ ముందు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భద్రాచలం జైలుకు తరలించారు. పాల్వంచ పోలీసుస్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో ఏఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 3న నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. భార్య, ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి.. తానూ నిప్పంటించుకున్నారు. ఘటనాస్థలిలో రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, చిన్నకూతురు సాహిత్య చనిపోపోయిన విషయం విదితమే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దకుమార్తె సాహితీ 5వ తేదీ ఉదయం 6 గంటలకు మృతిచెందింది. 3వ తేదీన రామకృష్ణ బావమరిది జనార్దన్ ఫిర్యాదుతో పాల్వంచ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 302, 307, 306 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో, సూసైడ్ నోట్లో రాఘవపై ఆరోపణలు చేశారు. రాఘవతో పాటు తల్లి సూర్యవతి, అక్క లోగ మాధవి కారణంగానే చనిపోతున్నట్టు అందులో వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం 8 ప్రత్యేక బృందాల ద్వారా ఆంధ్ర, తెలంగాణల్లో వెతికారు. దమ్మపేట మండలం మందలపల్లి వద్ద శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. రాజమండ్రి, అక్కడి నుంచి విశాఖ పట్టణం తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు కారులో వస్తుండగా దమ్మపేట ఎస్ఐ పట్టుకున్నారు. రాఘవతో పాటు ముక్తిని గిరీష్, కారు డ్రైవర్ కొమ్ము మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం విచారణ అధికారి ఆర్కే ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. పలు అంశాలపై రాఘవను విచారించినట్టు ఏఎస్పీ వివరించారు.రామకృష్ణను బెదిరించినట్టు విచారణ అధికారి ఎదుట వనమా రాఘవ అంగీకరించాడు. ఆధారాలను సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. రాఘవపై మొత్తం 12 కేసులున్నాయని, వాటన్నింటిపై విచారిస్తామని ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులుండగా వారిలో ఏ1 మండిగ నాగరామకృష్ణ(40) చనిపోయారని, ఏ2 వనమా రాఘవేంద్రరావుతో పాటు ఏ5 ముక్తిని గిరీష్, ఏ8 కొమ్ము మురళీకృష్ణను అరెస్టు చేశామన్నారు. ఏ3 రామకృష్ణ తల్లి మండిగ సూర్యవతి, ఏ4 అక్క కొమ్మిశెట్టి లోవ మాధవి, ఏ6 చావా శ్రీనివాస్, ఏ7 రమాకాంత్ పరారీలో ఉన్నారని వివరించారు.
రిమాండ్ ఖైదీ నెంబర్ 985
వనమా రాఘవను కొత్తగూడెం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నీలిమ ముందు హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. భద్రాచలం సబ్ జైలులో వనమా రాఘవకు 985 నెంబర్‌ను కేటాయించా రు. రాఘవను కోర్టుకు తరలిస్తుండగా కొత్తగూడెం బస్టాండ్, పోలీస్ స్టేషన్ సెంట ర్లో యువత రోడ్డుపైకి చేరి రాఘవను ఉరి తీయాలని నినాదాలు చేశారు.బీజేపీ నాయ కులు రాఘవను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.