Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంజికి గతిలేనోళ్లు వంట మాస్టర్లా
- మాదిగోల్లు వడ్డిస్తే.. మేము తినాలా
- హోటల్లో దళిత యువకునిపై పెత్తందారుల వైఖరి
- మరో ఘటనలో దళితుల భూములపైకొచ్చి దాడి
- వరుస ఘటనలపై స్పందించని అధికారయంత్రాంగం
- దళితులపై వివక్షకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి.పరుషరాములు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
గంజికి లేనోళ్లకు వంటలు చేయడమే రాదు.. అలాంటిది మాదిగోళ్లు వడ్డిస్తే మేము తినాలా.. డబ్బులు పెట్టి హోటల్లో భోజనం చేయడానికి వస్తే.. మీకిష్టమొచ్చినోల్లతో వడ్డిస్తే ఎలా.. మాదిగోళ్లతో వంటలు చేసినా.. వడ్డన చేసినా.. మీ హోటల్ మూసేసుకోవాలంటూ.. పెత్తందారలు హుకుం జారీ చేశారు. దాంతో ఆ దళిత యువకున్ని తొలగించడమే కాకుండా.. హోటల్‌నూ మూసేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దళితులపై వరుసగా వివక్ష ఘటనలు, దాడులు జరుగుతున్నా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నారాయణపేట జిల్లాలో తాజాగా మరో ఘటన జరిగింది. దళితులు సాగులో ఉన్న భూములకు తప్పుడు పత్రాలు సృష్టించి.. తమవేనంటూ కొందరు వచ్చారు. ప్రశ్నించిన దళితులపై దాడులు చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.
ఊర్కొండ మండల కేంద్రంలో మహబూబ్‌నగర్ నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారి పక్కనే అన్నపూర్ణ హోటల్ ఉంది. అందులో రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు గువ్వ వంశీ వంటల మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. వంటలు చేయడం అయ్యాక.. కస్టమర్లకు అతనే వడ్డన కూడా చేసేవాడు. జనవరి 2న హోటల్లోకి గోవిందు మల్లయ్య అనే వ్యక్తి అన్నం తినడానికి వచ్చాడు. అతనికి వడ్డించడానికి గువ్వ వంశీ వెళ్లగా.. ''మాదిగోడు వడ్డిస్తే.. మేము తినాలా'' అంటూ హోటల్ యజమానిపై అరిచాడు. దాంతో మరో యువకుడు అతనికి వడ్డించాడు. జనవరి 4న జంగారెడ్డి, అంతిరెడ్డి, ఓర్పు ఆంజనేయులు, ఈదమయ్య, అనిల్, ఆంజనేయులు, పెద్దనారాయణ, బ్రహ్మచారి, లక్ష్మయ్య అదే హోటల్‌కు భోజనానికి వెళ్లారు. వారికి కూడా గువ్వ వంశీ వడ్డించేందుకు వెళ్లగా.. అదే సీన్ రిపీట్ అయింది. అతన్ని తొలగించాలని, లేదంటే హోటల్ మూసుకోవాలని బెదిరించారు. దాంతో హోటల్ యజమాని వెంటనే దళిత యువకుడిని విధుల నుంచి తొలగించారు. బాధిత యువకుడు పోలీసు స్టేషన్లో కేసు పెట్టినా.. కొంతమంది పైరవీకారులు రాజీపడేలా చేశారని తెలుస్తోంది. అదేవిధంగా నాగర్‌కర్నూల్ జిల్లా జమిస్తాపూర్‌లో ఓ దళిత వృద్ధుడు బీడు భూముల్లో మేకలు మేపడానికెళ్లాడు. అయితే, పంట పొలంలో మేకలు పడ్డాయని రెడ్డి సామాజిక తరగతికి వ్యక్తి గొడ్డలితో వృద్ధుని తలపై కొట్టాడు. వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన వృద్ధుడు మృతిచెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్త మొల్గర గ్రామానికి చెందిన మహేష్ వినయక చవితిరోజు విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తుండగా.. పెత్తందారులు దాడి చేసి చంపేశారు. గ్రామంలో జరిగిన అవినీతిపై వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడనే అక్కసుతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో రాత్రి పూట వార్డులోకి వచ్చారని దళితులపై దాడి చేసి తల పగలకొట్టారు.
దళితుల భూముల్లోకి..
నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో సూమారు 50 దళిత కుటుంబాలు ఎన్నో ఏండ్ల నుంచి భూములను సాగు చేసుకుంటున్నాయి. ఇటీవల కొందరు పెత్తందారులు.. ఆ భూమి తమ దంటూ తప్పుడు కాగితాలతో భూమిపైకి వచ్చారు. ఇక్కడ మీకెక్కడిదని దళితులు ప్రశ్నించారు. దాంతో పెత్తందారీ నాయకులు కర్రులు, గొడ్డళ్లతో దళితులపై దాడిచేశారు. కొంతమందికి కాళ్లు, చేతులు విరిగా యి. దళితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్ప టికీ పట్టించుకోలేదు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నా అధికారులుగానీ, పోలీసులుగానీ పట్టించుకోకపోవడం దారుణం.
బతుకుదెరువు లేకుండా చేశారు
గువ్వ వంశీ- ఊర్కొండ
నేను వంటల మాస్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాను. మాదిగోడు వంట చేస్తే ఎలా తినేది అంటూ.. హోటల్ యజమానులతో పెత్తందారులు గొడవ పడ్డారు. దాంతో నాకు ఉద్యోగం లేకుండా పోయింది. ఎక్కడికి వెళ్లినా నీవు పనిచేస్తే హోటల్‌ను మూసేసుకోవాల్సిందే అని బెదిరించారు.
దళితులపై దాడులను అరికట్టాలి
పి.పరుషరాములు- కేవీపీఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి
జిల్లాలో దళితులపై అనేక దాడులు జరుగుతు న్నా అధికారులు స్పందించడం లేదు. ఊర్కోండ మండల కేంద్రంలోని హోటల్లో దళిత యువకున్ని అవమానపరిచారు. అతను వండితే భోజనం నిరాకరించిన బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు
విజరు- ఎస్ఐ ఊర్కోండ- నాగర్‌కర్నూల్ జిల్లా
దళితులపై ఎవరైనా వివక్ష చూపితే చర్యలు తప్పవు. కేసు విషయంలో వంశీ దరఖాస్తు చేశాడు. తర్వాత పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటామని పోయారు. సదరు వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించం. చట్టాన్ని ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటాం.