Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాల స్థాయిలోనే ప్రత్యామ్నాయ రాజకీయశక్తుల ఏకీకరణ
- సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శి సురేందర్సింగ్ మాలిక్
''దేశంలో రాజకీయమార్పు మొదలైంది. రైతాంగ ఉద్యమం దాన్ని మరింత విస్తృతం చేసింది. మతోన్మాదశక్తులను నిరోధిస్తూ, ప్రజాస్వామిక శక్తుల ఏకీకరణకు రాష్ట్రాల స్థాయిలోనే అంకురార్పణ జరుగుతున్నది. భవిష్యత్ రాజకీయ ముఖచిత్రానికి అక్కడి నుంచే అడుగులు పడుతున్నాయి. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయపార్టీ కేంద్రస్థాయిలో లేదనడం సరికాదు. అది రాష్ట్రాల నుంచే ఆవిర్భవిస్తున్నది. బీజేపీని ఇప్పుడు ప్రజలు అనుమానిస్తున్నారు. భ్రమలు తొలుగుతున్నాయి. ప్రాంతం, కులం, మతం ఆధారంగా ప్రజల్ని చీల్చే కుట్రల్ని అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ పరాజయం పాలైంది. అనేకచోట్ల చావుతప్పి కన్నులొట్టపోయినట్టు రాజకీయాలను నెట్టుకొస్తున్నది'' అంటూ నవతెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీపీఐ(ఎం) హర్యానా రాష్ట్ర కార్యదర్శి సురేందర్సింగ్ మాలిక్ ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన 'నవతెలంగాణ'తో మాట్లాడారు.
ప్ర- హర్యానాలో రాజకీయపరిస్థితులు ఎలా ఉన్నాయి?
జ- హర్యానాలో బీజేపీ-జేజేపీ (జననాయక్ జనతాపార్టీ) ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2019లో దాదాపు 75 అసెంబ్లీ సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తంచేసిన బీజేపీ 45 స్థానాలకే పరిమితం అయ్యింది. అంతకుముందు జరిగిన ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బలం తగ్గింది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం. వామపక్షాల బలం పరిమితం.
ప్ర- బీజేపీ బలం తగ్గడానికి కారణాలు ఏంటి?
జ- బీజేపీపై ప్రజల్లో ఉన్న భ్రమలు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవు. శిక్షణ లేదు. పొట్టకూటికోసం ఇక్కడి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. యువతరం తీవ్ర నిరాశ, నిస్ఫృహల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో 60వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో వస్త్రపరిశ్రమ అతి పెద్దది. ప్రభుత్వ విధానాలతో ఆ పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. విద్య, వైద్యం, రవాణా సహా అన్నింటినీ ప్రయివేటీకరిస్తున్నారు. ప్రజలతో సంబంధం లేకుండా పాలన సాగుతోంది. ప్రయివేటురంగంలోనూ పర్మినెంట్ ఉద్యోగాలు లేవు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే.
ప్ర- మారుతీ ఉద్యోగ్, హౌండా కంపెనీల్లో జరిగిన ఘటనల తర్వాత కార్మికోద్యమంలో ఏమైనా మార్పులు వచ్చాయా?
జ- కార్మికులు, ఉద్యోగుల హక్కుల్ని హరించడానికి యాజమాన్యాలకు, ప్రభుత్వాలకూ మారుతీ, హౌండా ఘటనలు బాగా ఉపయోగపడ్డాయి. అదే సమయంలో రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కనీస వేతనాలు లేవు. పనిభారాలు పెరిగాయి. కార్మికవర్గంలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అది పెచ్చరిల్లితే మరోసారి మారుతీ, హౌండా వంటి ఘటనలు పునరావృతమవుతాయి. ప్రస్తుతం కార్మికుల అవసరాలు, ఆవేదన, ఆందోళన, అసంతృప్తి, ఆగ్రహం నివురుకప్పిన నిప్పులా ఉన్నాయి.
ప్ర- సీపీఐ(ఎం)గా మీరెలాంటి పాత్ర పోషిస్తున్నారు?
జ- రాజకీయంగా రాష్ట్రంలో మాపాత్ర పరిమితం. అదే సందర్భంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో బలంగా ఉన్నాం. ఇక్కడి సీఐటీయూకి లక్షకు పైగా సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఇక్కడి అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాం. ప్రయివేటు పరిశ్రమల్లో పర్మినెంట్ ఉద్యోగాలనేవి లేవు. అన్నీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలే. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యుత్, ఆరోగ్యం వంటి పలు ప్రభుత్వ రంగాల్లో 'సర్వ్కరమ్చారి సంఫ్‌ు'గా బీజేపీ మతోన్మాద ప్రమాదం, ప్రయివేటీకరణ విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. నెలరోజులుగా ఇక్కడి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామీణ సఫాయి కర్మచారి ఆందోళనలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగం 34 శాతంగా ఉంది.
ప్ర- రైతు ఉద్యమ ప్రభావం భవిష్యత్ పోరాటాలపై ఎలా ఉండబోతుంది?
జ- ప్రజాస్వామ్య పోరాటాలకు నిలువెత్తు నిదర్శనం ఢిల్లీ రైతాంగ పోరాటం. ఆ స్ఫూర్తి ఇప్పుడు అన్ని రంగాలపై ఉంది. రైతాంగ ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఒకప్పుడు ఉమ్మడిగా ఉండి, పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రంగా విడిపోయినప్పుడు ఉన్న సమస్యల్ని సైతం మరోసారి తెరపైకి తెచ్చి, విభజన రాజకీయాలు చేయాలని బీజేపీ ప్రయత్నం చేసింది. కులాలు, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు వాస్తవాలను తెలుసుకున్నారు. సంయమనంతో పోరాడి విజయం సాధించారు. దీనివల్ల హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన రేఖలు చెరిగిపోయాయి. పంజాబ్, హర్యానా ఏక్తా మూవ్మెంట్ బలపడింది. దీన్ని విచ్ఛిన్నం చేసేందుకు అధికారంలో భాగస్వామ్యంగా ఉన్న జేజేఎం సహకారంతో బీజేపీ ప్రయత్నిస్తోంది.
ప్ర- కుల రాజకీయాల ప్రభావం ఎలా ఉంది?
జ- ఇప్పుడు బీజేపీకి ఉన్న ఏకైక రాజకీయ ఆయుధం అదే. మెజారిటీ కులంగా ఉన్న జాట్లను రెచ్చగొట్టారు. ఓబీసీ జాబితాలో చేర్చి, రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని ఇతర కులాలు వ్యతిరేకించేలా ప్రేరేపించారు. అసలు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలే లేనప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి ఏం ప్రయోజనం అనే అంశంపై ఇప్పుడు జాట్లు పునరాలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనలకు విఘ్నం కల్పించేలా రకరకాల ఎత్తుగడలను బీజేపీ అవలంబిస్తున్నది.
ప్ర- ప్రత్యామ్నాయం చూపకుండా, బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్తున్నారు. ఇది ప్రజల్లో గందరగోళానికి దారితీయదా?
జ- దీనిలో ఎలాంటి గందరగోళం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీని బలంగా ఢకొీట్టే ప్రత్యామ్నాయ పార్టీ లేకుండొచ్చు. కానీ రాష్ట్రాల స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయపార్టీలు ఉన్నాయి. విధానాల ప్రాతిపదికగా జరిగే పోరాటాల్లో కలిసొచ్చే పార్టీలూ ఉన్నాయి. వాటన్నింటినీ సమీకరిస్తే, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం పెద్ద సమస్యే కాదు. బీజేపీ మతోన్మాద అజెండాను క్షేత్రస్థాయిగా రాష్ట్రాల్లోనే దెబ్బకొట్టాలి. ప్రస్తుతం జరుగుతున్న సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో ఈ అంశాలపైనా చర్చిస్తున్నాం.