Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) భూముల వివాదంలో ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి చెప్పిన తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ దాఖలైంది. ఆ భూములు ప్రభుత్వానివేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని హెచ్‌సీయూ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. భూములపై హెచ్‌సీయూకి చట్టబద్ధ హక్కు లేదనడం సరికాదన్న ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరింది. ఇటీవల చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ నేతత్వంలోని డివిజన్ బెంచ్ అప్పీల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేతకు బెంచ్ నిరాకరించింది. తమ భూమిలో జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌సీయూ దాఖలు చేసిన పిటిషన్ సింగిల్ జడ్జి కొట్టివేయడం అన్యాయమనీ, తమకు 1975లో 2,324 ఎకరాల భూమిని రాష్ట్రం ఇచ్చిందని తెలిపింది. అప్పటి నుంచి తమ ఆధీనంలోనే భూమి ఉందని హెచ్‌సీయూ వాదించింది. 2,324 ఎకరాల భూమిలో 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 500 ఎకరాలను ఐఎంజిబి ఇచ్చినప్పుడు తమతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుందనీ, భూమిపై తమకు హక్కు ఉందని తెలిపింది. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది.
రెండు స్కాముల్లో ఈడీ అప్పీళ్లు
రెండు వేర్వేరు కేసుల్లో నిందితుల రిమాండ్‌కు సంబంధించి మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయకపోవడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైకోర్టులో సవాల్ చేసింది. ఈడీ వాదనల తర్వాత న్యాయస్థానం తీర్పులను వాయిదా వేసింది. రూ.230 కోట్ల ఐఎంఎస్ స్కాం నిందితుడిగా ఉన్న ఓమ్ని మెడి కంపెనీ ఎండీ కె.శ్రీహరిబాబును అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిస్తే.. సీఆర్పీసీ 41-ఎ సెక్షన్ నోటీసు ఇవ్వలేదనీ, రిమాండ్‌కు పంపలేదని ఈడీ తరపు న్యాయవాది చెప్పారు. ఈడీ దాడి చేసి రూ.135 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినా నిందితుడు విడుదల కావడం దారుణమని ఆయన తెలిపారు. మధుకాన్, రాంచి ఎక్స్‌ప్రెస్‌వేస్ లిమిటెడ్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు బ్యాంకు నుంచి రూ.1,190 కోట్ల రుణం తీసుకుని రూ.260 కోట్లను మళ్లించిన కేసులో కూడా అదేవిధంగా జరిగిందని చెప్పారు. ఈ రెండు కేసుల్లో నిందితులను రిమాండ్‌కు పంపకపోవడాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.