Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024 ఎన్నికల్లో ఓడించేందుకు ప్రజలు సిద్ధం
- కులరహిత సమాజం, సామాజిక న్యాయం కోసం పోరాటాలు
- జాతీయ కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా చెప్పారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ప్రజల ఆలోచనల్లోనూ మార్పు కనపడుతున్నదని తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ వ్యతిరేక ఓట్లను ఐక్యం చేయడంతో సీపీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భంగపాటు తప్పదని హెచ్చరించారు. 2024 సాధారణ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని వివరించారు. ఈఏడాదంతా పోరాటాల కాలంగా ఉండబోతున్నదని చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, కులరహిత సమాజం, సామాజిక న్యాయం ప్రతిపాదికన ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ ధనవంతమైన పార్టీ, డబ్బు గుమ్మరించి సోషల్ మీడియా ద్వారా ప్రజల ఆలోచనలను హైజాక్ చేస్తున్నదని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, బాలకృష్ణతో కలిసి రాజా విలేకర్లతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటంలో ప్రతిపక్షాల పాత్ర కీలకంగా మారిందని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పవర్ కేంద్రాన్ని అడ్డుకోవాలని కోరారు. వాటి ఫాసిస్టు విధానాలు రాజ్యాంగానికి, పార్లమెంటు వ్యవస్థలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. ఇటీవల పార్లమెంటులో 12 మంది ఎంపీలను అప్రజా స్వామికంగా సస్పెండ్ చేసిందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదనీ, అందులో భాగంగానే చాలా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలను లాగేసుకున్నదని గుర్తు చేశారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండానే సాగు చట్టాలను ఆమోదించిందనీ, ఏడాదిపాటు రైతులు పోరాడి వాటిని వెనక్కి కొట్టగలిగారని ప్రశంసించారు. జీఎస్టీ పేరుతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నదని వివరించారు. తనకు నచ్చని వారిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నదని విమర్శించారు. 'కనీస ప్రభుత్వం-గరిష్ట పరిపాలన' అనే పద్దతుల్లో బీజేపీ పాలన కొనసాగుతున్నదన్నారు. కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేందుకే విమానశ్రయాలు, రైల్వేలు, బ్యాంకులు ప్రయివేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. దేశ సంపదను మోడీ లూఠీచేస్తున్నారని చెప్పారు. వీటికి వ్యతిరేకంగా ఫిబ్రవరిలో జరగనున్న కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.