Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదు
- ప్రధాని పర్యటనలో భద్రతా లోపాలంటూ అబద్ధపు ప్రచారం
- ఉగ్రవాద దాడుల సమయంలోనూ మతకలహాల్లేవు: సీపీఐ(ఎం) పంజాబ్ కార్యదర్శి సుఖ్విందర్సింగ్
ప్రజల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని సీపీఐ(ఎం) పంజాబ్ రాష్ట్ర కార్యదర్శి సుఖ్విందర్సింగ్ సెఖాన్ చెప్పారు. వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి పరాభవం తప్పదని అన్నారు. పార్లమెంటులో చర్చించకుండా, ఏకపక్షంగా మూడు వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం తేవడం పట్ల అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని వివరించారు. ఏడాదికిపైగా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని వీరోచితంగా రైతులు ఉద్యమించారని గుర్తు చేశారు. 700 మంది రైతులు మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రైతులు ఐక్యంగా, శాంతియుతంగా ఉద్యమం కొనసాగించారని చెప్పారు. ఆ తర్వాతే మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనీ, ఆ మూడు చట్టాలనూ రద్దు చేసుకున్నట్టు ప్రకటించిందని అన్నారు. నయా ఉదారవాద విధానాలపైనే రైతులు విజయం సాధించారన్నారు. నియంత మోడీని, మతోన్మాద ఆర్ఎస్ఎస్ను, సామ్రాజ్యవాదాన్ని ఓడించారని చెప్పారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్న సందర్భంగా నవతెలంగాణ
ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు సుఖ్విందర్సింగ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఢిల్లీ సరిహద్దులో సాగిన రైతాంగ ఉద్యమ అనుభవాలను వివరించండి?
ఏడాదికిపైగా రైతాంగ ఉద్యమం అక్కడ సాగింది. మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదన్న అభిప్రాయం బలంగా ఉండేది. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే రైతాంగం ఉద్యమించింది. మోడీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ను ఓడించింది. పంజాబ్ నుంచే ఈ రైతాంగ ఉద్యమం మొదలైంది. ఈ చట్టాల వెనుక ఆర్ఎస్ఎస్, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, కార్పొరేట్ శక్తులున్నాయి. అయినా రైతాంగ ఉద్యమం ఓడించడం ఓ కొత్త చరిత్రకు నాంది పలికింది. 1991 నుంచి దేశంలో నయాఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఆ విధానాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. ఇప్పుడు రైతాంగం ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించడం అందరికీ ఆదర్శం.
పంజాబ్‌లో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటారు?
పంజాబ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 14న పోలింగ్ ఉంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అమరీందర్‌సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. సుఖ్‌దేవ్‌సింగ్ దీండ్సా నేతృత్వంలో శిరోమణి అకాలీదళ్ (సంయుక్త), పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. 22 రైతు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త సమాజ్ మోర్చా (ఎస్ఎస్ఎం) ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ), బీఎస్పీ కలిసి పోటీకి సిద్ధమవుతున్నాయి. సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఆమాద్మీ పార్టీ (ఆప్) పోటీ చేస్తున్నది. గత అసెంబ్లీలో ఆప్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు గెలిచినా 11 మంది కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలత లేదు. పంజాబ్‌లో శాంతిని నెలకొల్పాలి. ఉగ్రవాద దాడులు, మతోన్మాద అలజడులు లేకుండా చూడాలి.
చండీఘర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతుందంటారు?
చండీఘర్‌లో పంజాబ్ ప్రజలు ఎక్కువగా నివసించరు. ఢిల్లీ తరహాలోనే చండీఘర్ ఉంటుంది. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని కావడంతో అన్ని ప్రాంతాల ప్రజలు అక్కడ నివసిస్తారు. అయితే ఇది పంజాబ్‌లో కొంత మేరకు ప్రభావం చూపే అవకాశమున్నది. పంజాబ్ ప్రజలు బీజేపీకి వ్యతిరేకం. అక్కడ బీజేపీతో నేరుగా ఆప్ పొత్తుపెట్టుకునే అవకాశం లేదు. కానీ బీజేపీకి బీ-టీంగా ఆప్ వ్యవహరిస్తున్నది. దళితుడు చరణ్‌జిత్‌సింగ్ చన్నీ పంజాబ్ సీఎం అయ్యారు. అక్కడ దళితులు 32 శాతం ఉన్నారు. వారి ఓట్లు కాంగ్రెస్‌కు పడే అవకాశమున్నది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌లో ఏ పార్టీకి వెళ్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. పంజాబ్‌లో హిందువులు 48 శాతం ఉన్నారు. అయినా బీజేపీకి వారి ఓట్లు పడే అవకాశం లేదు. అక్కడ హిందువులు లౌకికవాదులుగా ఉన్నారు. ఉగ్రవాద దాడులు జరిగిన సమయంలోనూ, సిక్కుల ధార్మిక మత గ్రంథాలను చింపినా మతకలహాలు చోటుచేసుకోలేదు. గురునానక్ బోధనలు సైతం మానవత్వాన్ని ప్రబోధించాయి. అందుకే అక్కడ సెక్యులరిజం ఉన్నది.
పంజాబ్ పర్యటనలో ప్రధానికి భద్రతా వైఫల్యం జరిగిందంటూ ప్రచారం జరగడంపై ఏమంటారు?
ఈనెల ఐదున ప్రధాని నరేంద్రమోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ బీజేపీ బహిరంగసభ నిర్వహించాలని ఏర్పాట్లు చేసింది. ప్రజలను సమీకరించాలని నిర్ణయించింది. అనుకున్న స్థాయిలో ప్రజలు ఆ సభకు రాలేదు. దీంతో భద్రతా వైఫల్యం పేరుతో ఓ సమస్యను సృష్టించి సభకు రాకుండా ప్రధాని పర్యటనను రద్దు చేసుకుని వెనుదిరిగి వెళ్లిపోయారు. కానీ బీజేపీ భద్రతా లోపాల పేరుతో అబద్ధాలను ప్రచారం చేసింది. దీనికి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ సరైన సమాధానమిచ్చారు. 70 వేల మందికి కుర్చీలు వేస్తే 700 మంది సైతం రానందుకే ప్రధాని వెళ్లిపోయారని అన్నారు. ఇది వాస్తవం. పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైంది కాదు. భారత సరిహద్దులో ఉన్న మైనార్టీ ప్రభుత్వంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మోడీ ప్రధాని అయ్యాక రాజ్యాంగ వ్యవస్థలపైనా, ప్రజాస్వామ్యంపై దాడి పెరుగుతున్నది. పార్లమెంటులో చర్చ లేకుండానే చట్టాలను ఆమోదిస్తున్నారు. ఎవరినీ మాట్లాడినివ్వడం లేదు. దేశంలో ప్రజస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. లౌకికవాదులు, కమ్యూనిస్టులు, మేధావులు, రైతులు, కార్మికులు, ప్రజలు దాన్ని కాపాడుకోవాలి.