Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య
- బెజవాడ దుర్గమ్మ దర్శనానికెళ్లి..
నవతెలంగాణ-కంఠేశ్వర్
అప్పులు.. ఓ కుటుంబం ఊపిరి తీశాయి. విజయవాడ దుర్గమ్మ దర్శనానికని వెళ్లిన భార్యాభర్త, ఇద్దరు పిల్లలు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. తల్లీకొడుకు సిరంజిలో పాయిజన్ ఎక్కించుకోగా, తండ్రీకొడుకు కృష్ణానదిలోకి దూకి ప్రాణం తీసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం వెలుగుజూసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఆసంపల్లి గ్రామానికి చెందిన పప్పుల సురేష్(56), శ్రీలత(42) దంపతులు. వీరికి అఖిల్(28), ఆశిష్(22) కుమారులు. సురేష్ కొన్నేండ్ల కిందట నిజామాబాద్‌కి వచ్చి స్థిరపడ్డాడు. సురేష్ మెడికల్ షాప్ నడుపుతుండగా, కుమారుడు అఖిల్ పెట్రోల్ బంకు లీజు తీసుకొని నడుపుతున్నాడు. చిన్న కుమారుడు ఆశిష్ బీఫార్మసీ చదువుతున్నాడు. వ్యాపారంలో భాగంగా సురేష్‌కు అప్పులయ్యాయి. అప్పుల వారి ఒత్తిడి పెరగడంతోపాటు ఫైనాన్స్ వారు నోటీసులు అందజేశారు. రెండ్రోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోని కనకదుర్గ ఆలయానికి వెళ్లారు. కాగా ప్రయివేటు ఫైనాన్స్ వాళ్లు తన ఇంటికి నోటీసు ఇచ్చిన విషయాన్ని బంధువులు సురేష్‌కు ఫోన్ చేసి వివరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేష్.. బావమరిదికి ఫోన్ చేసి తాము అప్పుల ఊబిలో కూరుకుపోయమని, ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. వెంటనే వారు ఆలయ నిర్వాహకులకు, సత్రం వారికి ఫోన్ చేసి విషయం తెలియజేయగా.. వారు వెళ్లి చూశారు. తల్లీకొడుకు సత్రంలోని గదిలో ఆత్మహత్య చేసుకోగా తండ్రి, మరో కొడుకు కృష్ణా నదిలో దూకాదు. కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. ఈ మేరకు విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.