Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మళయాళీ అసోసియేషన్ సభలో పినరయి విజయన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రానున్న ఐదేండ్లలో కేరళలో భారీ అభివృద్ధిని సాధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో అత్యున్నత అభివృద్ధిని సాధిస్తూ తమ రాష్ట్రం ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలవనుందని ఆయన చెప్పారు. 2016కి ముందుతో పోల్చితే వేగంగా వృద్ధిని సాధిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని వివరించారు. సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేసిన ఆయన శనివారం తెలంగాణ మలయాళీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం కొత్త జాతీయ రహాదారులు, విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఉత్తర కేరళ నుంచి త్రివేండ్రం వరకు 600 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్ ప్రాజెక్టును చేపడుతున్నామని వివరించారు. రూ.65వేల కోట్ల విలువ చేసే ఈ 'సిల్వర్ లైన్ కెఎ రైల్ ప్రాజెక్టు' పూర్తయితే ఆ ప్రాంత ప్రయాణికులు కేవలం నాలుగు గంటల్లోనే గమ్యస్థానాలకు చేరొచ్చని తెలిపారు. దీంతోపాటు 600 కిలోమీటర్ల మేర నీటి రవాణా ప్రాజెక్టులను చేపడుతున్నామని వివరించారు. దీంతో పర్యాటక రంగం మరింత అభివృద్థి చెందుతుందని అన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను మరింత ఆకర్షించడానికి వీలుగా ఆ రంగంలో పలు కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నామని చెప్పారు. 2018లో వచ్చిన నిఫా వైరస్ను ఎదుర్కోవటంతోపాటు 2020లో కరోనా కట్టడిలోనూ తమ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని విజయన్ ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్ నియంత్రణకు సంబంధించి కేరళ వైద్య శాఖ మంత్రి ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రశంసలు అందుకున్నారని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే విద్యారంగంలో సమాగ్రాభివృద్ధిని సాధించామన్నారు. ఉన్నత విద్యా రంగంలో మరిన్ని కొత్త మార్పులను చేపడుతున్నామని వెల్లడించారు. కృత్రిమ నైపుణ్యం (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ)లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులకు మద్దతును అందిస్తున్నామని వివరించారు.