Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందుకోసం లౌకిక, ప్రగతిశీల శక్తులు ఏకమవ్వాలి...
- మోడీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
- విభజన రాజకీయాలు దేశానికే ప్రమాదం
- సీఎం కేసీఆర్‌తో భేటీలో సీపీఐ (ఎం) అగ్రనేతలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో మతోన్మాద బీజేపీ పాలనను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరముందని సీపీఐ (ఎం), సీపీఐ అగ్రనేతలు... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వేర్వేరుగా జరిగిన భేటీల్లో అన్నారు. రైతులు, కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకంగా ఆ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ, విభజన రాజకీయాలను పెంచి పోషిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రగతిశీల శక్తులు ఏకమవ్వాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. హైదరాబాద్‌లో కొనసాగుతున్న సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తదితరులు... సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు శనివారం ప్రగతి భవన్లో ఆయనతో భేటీ అయ్యారు. మరోవైపు హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో పాల్గొనేందుకు విచ్చేసిన సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత బినరు విశ్వం, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు కూడా కేసీఆర్‌తో ఆ తర్వాత విడిగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పంజాబ్‌లో ప్రధాని మోడీకి రైతుల నుంచి నిరసన సెగ తగలటం తదితరాంశాలు వారి మధ్య చర్చకొచ్చినట్టు తెలిసింది. పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని వామపక్ష నేతలు వ్యాఖ్యానించారు. అందువల్ల బీజేపీని ఓడించేందుకు దేశంలోని భావ సారూప్యత కలిగిన ప్రగతిశీల పార్టీలు, శక్తులన్నీ ఒకే వేదిక మీదికి రావాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయంటూ వారు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైనట్టు తెలిసింది.