Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు, నాయకులు టూరిస్టులుగా రావడం కాదనీ, రాష్ట్రానికి ఏం తెస్తున్నారో కూడా చెప్పాలని టీఆర్ఎస్ నేతలు బీజేపీ నాయకుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్త చేతుల్తో రాష్ట్రానికి వచ్చి, ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడిపోతే ఇక్కడి ప్రజలకు ఒరిగేదేం లేదని స్పష్టంచేశారు. అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్కు ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే అర్హత లేదన్నారు. ఆదివారంనాడిక్కడి టీఆర్ఎస్ఎల్పీలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, పీయూసీ చైర్మెన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీకి ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నాడని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధికి ఆపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారా అని సవాలు విసిరారు. దేవుళ్ళను అడ్డం పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ప్రాణాలను బలిగొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడతామని బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారనీ, కేంద్రంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయో చెప్పాలని అన్నారు.