Authorization
Fri April 11, 2025 09:52:08 am
- తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వతంత్య్ర పోరాటంలో సబర్మతి ఆశ్రమంలోనే కీలక నిర్ణయాలు జరిగాయని తెలంగాణ సర్వోదయ మండలి అధ్యక్షులు ఆర్. శంకర్ నాయక్ తెలిపారు. సబర్మతి ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన అహ్మదాబాద్ గాంధీ ఆశ్రమం పునర్నిర్మాణం చేపట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ సర్వోదయ మండలి ఆదివారం హైదరాబాద్, ట్యాంక్ బండ్, అంబెద్కర్ విగ్రహం ఎదుట వినూత్న ప్రదర్శన నిర్వహించింది. గాంధీ ఆశ్రమాన్ని రక్షించండి - శాంతిని కాపాడండి, అహింస, శాంతి గాంధేయ భావజాలం వ్యాపారం కాదు, గాంధేయ వారసత్వాన్ని వాణిజ్యపరం చేయడం ఆపండి, సబర్మతి ఆశ్రమాన్ని పునరుద్ధరించడం ఆపండి అని ప్లకార్డులు చేతబూని, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మౌన నిరసన పాటించారు.అనంతరం ఆర్. శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర పోరాటంలో సబర్మతి గాంధీ ఆశ్రమం కీలక పాత్ర పోషించిందని, ఉద్యమంలో కీలక ఘట్టాలైన ఉప్పు సత్యాగ్రహం, దండి యాత్ర మొదలైనవి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయని తెలిపారు. జాతీయ స్మారక స్థలంగా ఉన్న గాంధీ ఆశ్రమాన్ని పునర్నిర్మాణ పేరిట ''ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా'' మార్చి ప్రధాని మోడీ తన స్వార్థ కార్పొరేట్ వ్యాపార స్నేహితుల ప్రయోజనాలకోసం ఈ దుర్మార్గమైన పని చేపట్టాడని ఆయన ఆరోపించారు. గాంధీజీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆదాయాన్ని ఆకర్షించడానికి సబర్మతి ఆశ్రమాన్ని మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే శాంతియుత ఆందోనళలు, ప్రదర్శనలు, పాదయాత్రలు, ధర్నాలు చేపడుతామని ఆర్. శంకర్ నాయక్ ప్రకటించారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ సర్వోదయ మండలి ప్రతినిధులు కె. చందు నాయక్, ఎన్. రూప్ సింగ్, రాకేష్ సింగ్, వి.పి. రాజు, బి. భాస్కర్, చత్రు నాయక్, మహమూద్, శంకర్, అమీనా, విజరు కుమార్, షమ, దశరథ్, రాజు తదితరులు పాల్గొన్నారు.