Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనేవరో..కార్యకర్తలకే తెలియదు : విలేకర్లతో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఏమైనా స్వాతంత్య్ర సమరయోధుడా అని శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ అరెస్టయి జైలుకెళ్లి వచ్చిన అనంతరం ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆయన్ను సమర్థిస్తూ, పరామర్శిస్తూ టీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గతంలో ఆయనెవరో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియదని చురకలంటించారు. కరోనా ఆంక్షలు పెట్టిన కేంద్ర ప్రభుత్వమే.. వాటిని అతిక్రమిస్తు న్నదని ఆరోపించారు. దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకొచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నీతులు వల్లిస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. ఒక ప్రధానమంత్రి ఓ కార్యక్రమానికి బయల్దేరి మధ్యలోనే వెనుదిరగడం దేశచరిత్రలో మొదటిసారనీ, దేశ ఔన్నత్యాన్ని తగ్గించిన వ్యక్తి నరేంద్రమోడీ అని విమర్శించారు. బీజేపీ దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు పగటి కలలు కంటున్నారన్నారు. రెండు ఉపఎన్నికల్లో గెలిచి వాపును చూసి బలుపుగా భావిస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి యూపీ సహా ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీఐడీ, ఐటీలను ఉసిగొలిపి అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడంతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో వడ్లు కొనబోమని చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వామపక్షాలతో కలిసి ముందుకెళ్లడంలో ప్రభుత్వ తప్పిదం లేదన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ పాశం రాంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యామా దయాకర్ పాల్గొన్నారు.