Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
- పర్యవేక్షించిన ఏసీపీ..
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ నగరంలోని కాకతీయ కెనాల్లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మట్టెవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొత్తవాడకు చెందిన దాసరి హర్షవర్ధన్, గజ్జల ఆకాశ్ గిర్మాజీపేట్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. వీరు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సెలవులు కావడంతో ఆదివారం మధ్యాహ్నం సెకండ్ డాక్టర్స్ కాలనీ ఫిల్టర్‌బెడ్ సమీపంలోని కాకతీయ కాలువలో ఈత కొట్టడానికి దిగారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు.. ప్రవాహం అధికంగా ఉందని చెప్పినా వినిపించుకోకుండా ఆకాశ్, హర్షవర్దన్ కెనాల్లోకి దిగారు. ఈ క్రమంలో ప్రవాహం అధికంగా ఉండటంతో వారు కొట్టుకుపోతుండగా మిగిలిన ఇద్దరు స్నేహితులు కేకలు వేస్తూ స్థానికులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపు నీటి ప్రవాహంలో హర్షవర్దన్, ఆకాశ్ గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు.. 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మట్టెవాడ సీఐ సీహెచ్ రమేష్, తన సిబ్బంది, జీడబ్య్లూఎంసీ డిజాసర్ట్ వెహికల్ సిబ్బందికి సమాచారం అందించి గజ ఈతగాళ్లతో రాత్రి వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సంక్రాంతి సెలవుల సందర్భంగా తల్లిదండ్రులు వారి పిల్లలను కాకతీయ కెనాల్ వైపుకు రాకుండా చూసుకోవాలని సూచించారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలను ఏసీపీ పర్యవేక్షించారు.