Authorization
Sun April 13, 2025 04:44:51 am
- కేంద్రం అనుమతిస్తే మళ్లీ పూర్వవైభవం
- ముడి సరుకు పుష్కలం.. రవాణా అనుకూలం
- ఉధృత పోరాటాలకు సీపీఐ(ఎం) కార్యాచరణ
- రేపు పార్టీలు, సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ). దశాబ్దకాలం కిందట ఓ వెలుగు వెలిగిన ఈ పరిశ్రమ అర్థాంతరంగా మూతపడింది. పరిశ్రమ, మైనింగ్ అవసరాల కోసం ప్రభుత్వం 2289.85 ఎకరాలను సేకరించింది. 1979 నుంచి పనులు ప్రారంభం కాగా ఏడాదికి 4లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14ఏండ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఈ పరిశ్రమ 1998లో మూతపడింది. ఈ పరిశ్రమ కోసం అంచనా వేసిన 48.18 మిలియన్ టన్నుల ముడిసరుకులో కేవలం ఆరు టన్నులు మాత్రమే వినియోగించింది. మిగితా 42.66 మిలియన్ టన్నుల ముడిసరుకు అందుబాటులో ఉంది. సుమారు వందేండ్లకు సరిపడా ముడిసరుకు నిల్వలున్నాయి. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోనూ లైమ్‌స్టోన్ నిల్వలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేశారు. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకు పుష్కలంగా ఉండటంతో పాటు సిమెంట్ రవాణాకు కూడా అనేక అనుకూల అంశాలున్నాయి. ఈ పరిశ్రమ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అతిసమీపంలో ఉండటంతో పాటు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారి ఉండటం.. మరో మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వేట్రాక్ వంటి రవాణా మార్గం ఉంది. సిమెంటు ఉత్పత్తి అయ్యే సమయంలో మన రాష్ట్ర అవసరాలతో పాటు సమీపంలోని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలకు కూడా సులువుగా రవాణా జరిగేది. ఇలాంటి అన్ని అనుకూలతలు ఉన్న ఈ పరిశ్రమ మూతపడటంతో కార్మికులతో పాటు ఆదిలాబాద్ జిల్లావాసులకు కూడా తీవ్ర నష్టం జరిగింది.
కేంద్రంపైనే భారం..!
ఈ పరిశ్రమ నడిచే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే ఈ పరిశ్రమ ఉందని ఇక్కడి జనాలు గర్వంగా చెప్పుకునేవారు. ఈ పరిశ్రమలో 700 మంది రెగ్యూలర్ ఉద్యోగులు, మరో 2 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేసేవారు. మరో 1500 మంది వరకు పరోక్షంగా ఉపాధి పొందేవారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతం కూడా వాణిజ్య కొనుగోళ్లతో సందడిగా ఉండేది. పరిశ్రమ మూతపడటంతో కార్మికుల జీవితాలు అగమ్యగోచరంగా మారగా.. వాణిజ్య మార్కెట్ కూడా తీవ్రంగా నష్టపోయింది. మరోపక్క సార్వత్రిక ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ నాయకులు ఎన్నికల్లో గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామని హామీలివ్వడం పరిపాటిగా మారింది. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. గెలిపిస్తే సీసీఐని తెరిపిస్తామని హామీనివ్వడంతో ఇక్కడి జనాలు బీజేపీని ఆదరించి ఎంపీగా గెలిపించారు. కానీ పరిశ్రమ తెరిపించే విషయమై స్థానిక ఎంపీ దృష్టిసారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పోరాటం కోసం సీపీఐ(ఎం) కార్యాచరణ
సీసీఐ పరిశ్రమ పున:ప్రారంభించి కార్మికులు, యువతకు ఉపాధి కల్పించాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నాయకులు అనేక ఉద్యమాలు చేశారు. గతేడాది పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవి కుమార్ జిల్లా నాయకులతో కలిసి పరిశ్రమను స్వయంగా పరిశీలించి తెరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజాగా ఐక్య పోరాటాలు ఉధృతంగా చేయాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 11న రాజకీయ పార్టీలు, ప్రజా, కుల, విద్యార్థి సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది.