Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రజాస్వామిక జీవోలపై కేంద్రానికి లేఖ
- మిర్చి పంట పరిశీలనకు బందం
- సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పంజాబ్‌లో మోడీ చేసిన డ్రామాతో పీఎం పదవిని దిగజార్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. దళిత సీఎంను నవ్వులపాలు చేయాలనే మోడీ కుట్ర చేశారని చెప్పారు. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోడెం వీరయ్య హాజరుకాగా, ఎమ్మెల్యేలు సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గైర్హజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, వనమా రాఘవ అరాచకాలు, మిర్చి పంట నష్టం, ధాన్యం కొనుగోలు, విద్యుత్‌చార్జీలు తదితర అంశాలపై చర్చించారు శాంతిభద్రతలు కాపాడాలంటూ గవర్నర్, డీజీపీకి వినతిపత్రం సమర్పించాలనీ, అప్రజాస్వామిక జీవోలు 124.317 వెంటనే రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అనంతరం భట్టి విక్రమార్క విలేకర్లతో మాట్లాడుతూ పంజాబ్‌లో మోడీ హాజరు కావాల్సిన బహిరంగ సభకు జనాలు రాకపోవడంతో మార్గమధ్యం నుంచి వెనుదిరిగి వెళ్లారని చెప్పారు. వాస్తవానికి విరుద్ధంగా తనకు సరైన భద్రత ఇవ్వలేదంటూ పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధింపులో భాగంగా ప్రజల దృష్టిలో ఆ ప్రభుత్వాన్ని తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని చెప్పారు. అందులో భాగంగానే పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు నేతలు ఆడుతున్న డ్రామాలు ఆపాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా ఉన్నాయని చెప్పారు. కింది స్థాయి పోలీసు యంత్రాంగాన్ని రాఘవ తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. రాఘవ అరాచకాలకు తాళలేక, పోలీసుల రక్షణ అందకపోవడంతో రామకష్ణ కుటుంబం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ ఘటనపై టీఆర్ఎస్ నుంచి రాఘవను సస్పెండ్ చేస్తే సరిపోదనీ, ఆయన తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును కూడా టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే దెబ్బతిన్న మిర్చి పంట పరిశీలనకు సీఎల్పీ బృందం వెళ్లనున్నట్టు తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.