Authorization
Fri April 11, 2025 05:34:31 am
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరికి చిత్రపురి సాధన సమితి వినతిపత్రం
నవతెలంగాణ-సిటీబ్యూరో
చిత్రపురి బాధితులకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందనీ, ఇండ్ల అక్రమాలు, వందల కోట్ల అవినీతిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తామని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చిత్రపురి అక్రమాలపై సీపీఐ(ఎం) అగ్రనేతలకు ఆదివారం సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె.ఈశ్వర్రావు ఆధ్వర్యంలో చిత్రపురి సాధన సమితి సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఇండ్లలో అక్రమాలు, వందల కోట్ల అవినీతి, కమిటీ సభ్యుల బంధుప్రీతికి సంబంధించిన సాక్ష్యాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు రాబోయే నాలుగు నెలల కాలంలో (3 జనవరి 2022 వరకు) జరిగిన తప్పులు సరిచేయాలని 2021 సెప్టెంబర్ 3వ తేదీన ప్రభుత్వ అధికారులను ఆదేశిస్తూ ఆర్డర్ జారీచేసిందనీ, అయినా స్పందనలేదని వివరించారు. 2003-2020 మధ్య కాలంలో కాదంబరి కిరణ్, వల్లభనేని అనిల్‌కుమార్, మొర వెంకటేష్, మహానందరెడ్డి, వినోద్‌బాల, తదితరులు చేసిన మరో 600 అక్రమాలు సాక్ష్యాలతో ప్రభుత్వ అధికారులకు అందజేసినా పట్టించు కునే పరిస్థితిలేదనీ, పైగా అక్రమార్కులకు ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుని వారి అక్రమాలను కొనసాగించేందుకు అధికారులే అవకాశం ఇస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన ఏచూరి, రాఘవులు తక్షణమే సీఎంకు లేఖ రాయడంతోపాటు స్పందనలేకుంటే సినిమా కార్మికుల ఉద్యమాలు ఉధృతం చేద్దామనీ, అవసరమైతే పార్లమెం ట్లోనూ చర్చిస్తామని భరోసా ఇచ్చారు. నిజమైన సినిమా కార్మికులకు అన్యాయం జరిగితే సీపీఐ(ఎం) సహించేదిలేదని చెప్పారు. రాబోయే చిత్రపురి ఉద్యమాల్లో సీపీఐ(ఎం) కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. సీపీఐ(ఎం) నేతలను కలిసిన ప్రతినిధి బృందంలో ఫిల్మ్ డైరెక్టర్ మద్దినేని రమేష్‌బాబు, కె.ఈశ్వర్రావు, వై మన్యవాసి, భద్ర ఉన్నారు.