Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకు ఉద్యోగుల పట్ల పాలకులది కపట ప్రేమ
- బీఎంఎస్ ప్రయివేటీకరణ వ్యతిరేకం వట్టిదే : ఏపీటీబీఇఎఫ్ మహాసభలో రిటైర్డ్ జస్టిస్ చంద్రు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''పాలకులు ప్రతిపక్షాలు, కార్మికుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఇందు కోసం కరోనాను ఒక సాకుగా చూపిస్తున్నాయి. పాలకులకు లేని ఆంక్షలను ప్రతిపక్షాలు, ఉద్యోగులకు విధిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగులు మహాసభ నిర్వహించుకునేందుకు చట్టబద్ధ హక్కు. అవసరం. నోట్లను రద్దు చేసిన బీజేపీ సర్కారు కొత్త నోట్లను ఇవ్వకుండా ప్రజాగ్రహాన్ని బ్యాంకు ఉద్యోగుల వైపు మళ్లించి వారి ప్రాణాల మీదికి తెచ్చింది. లాక్ డౌన్ సమయంలో అంతా వర్క్ ఫ్రమ్ హౌమ్ కు పరిమితమైన సమయంలో బ్యాంకు ఉద్యోగులను మాత్రం విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఇప్పుడేమో బ్యాంకు ఉద్యోగుల ప్రాణాలను కాపాడడంపై ఏదో శ్రద్ధ ఉన్నట్టు సమావేశం పెట్టుకుంటామంటే కరోనా వ్యాపిస్తుందంటూ సాకులు చెబుతున్నారని...'' రిటైర్డ్ జస్టిస్ చంద్రు విమర్శించారు. వేల మందితో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ర్యాలీలను నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు.
ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీటీబీఇఎఫ్) 29వ మహాసభలో ఆయన ప్రసంగించారు. ప్రజల డిమాండ్ మేరకే.... బ్యాంకులను జాతీయం చేశారని గుర్తుచేశారు. భారతీయ జనతా పార్టీ అనుబంధ కార్మిక సంఘం బీఎంఎస్ ప్రయివేటీకరణను వ్యతిరేకించడం వట్టిదేనన్నారు. ఆ సంఘాన్ని నమ్మడానికి వీల్లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితో సోషలిజం పరిరక్షణ కోసం బ్యాంకు ఉద్యోగులు, ఇతర కార్మికులతో కలిసి విశాలంగా ఆలోచించాలనీ, భగత్ సింగ్ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు.
కరోనాతో దేశాన్ని ప్రభుత్వరంగమే కాపాడింది : కౌర్
మహాసభను ప్రారంభించిన ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్ జిత్ కౌర్ మాట్లాడుతూ కరోనా వేళ దేశాన్ని కాపాడింది ప్రభుత్వరంగ సంస్థలేనని తెలిపారు. రైతులు ప్రజల ఆహారభద్రత కోసం పోరాడితే, బ్యాంకు ఉద్యోగుల ప్రజలను ఆర్థికంగా కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని తెలిపారు. జన్ ధన్ ఖాతాలను తెరిచేందుకు ప్రయివేటు బ్యాంకులు ముందుకు రాలేదని గుర్తుచేశారు. సమావేశంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం ఆన్ లైన్ లో మాట్లాడారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, ఏపీటీబీఇఎఫ్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.