Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి 23,24 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
- విజయవంతానికి కృషి చేయండి : సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ సంపదను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ పోరాటాల్లోకి రావాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షులు కె.హేమలత పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు, సరళీకరణ విధానాలను తిప్పికొట్టేందుకు ఫిబ్రవరి 23,24 తేదీల్లో తలపెట్టిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల వర్క్‌షాపు నాగరాజు గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు కీలక సంస్థలను ప్రయివేటీకరించాలనుకోవడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. మూడు నల్ల చట్టాలను పోరాడి వెనక్కికొట్టిన రైతాంగ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కార్మికులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు స్వదేశ్ దేవ్‌రారు మాట్లాడుతూ..నేషనల్ మానిటైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థలను వ్యూహాత్మక అమ్మకాల పేరుతో కారుచౌకగా కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగాన్ని కట్టబెట్టే బీజేపీ విధానాలను కార్మికులు తిప్పికొట్టాలన్నారు. ప్రజల సొమ్మును కార్పొరేట్లకు దోచిపెట్టడమే మోడీ సర్కారు విధానమైందని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు మాట్లాడుతూ..రాష్ట్రంలోని సీపీఎస్‌యూల కార్మికులందరూ రాజకీయాలకు అతీతంగా సమ్మెలోకి రావాలని కోరారు. సీపీఎస్‌యూ రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ జె.వెంకటేశ్ మాట్లాడుతూ...హైదరాబాద్‌లోని బీడీఎల్, బీఈఎల్, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, మిథాని, ప్రాగా టూల్స్, బీఎస్ఎన్ఎల్, ఆయిల్ సెక్టార్, ఎన్టీపీసీ, ఎన్ఎండీసీ, డోలమైట్, 6 జిల్లాల్లో విస్తరించి యున్న సింగరేణి, తదితర సంస్థల్లో సమ్మె క్యాంపెయిన్లను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాచరణను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, వివిధ సీపీఎస్‌యూల నాయకులు కొమురయ్య, జీఆర్ విజరుకుమార్, సాంబశివరావు, భాస్కర్‌రెడ్డి, సౌందర్‌రాజ్, దిల్‌రాజు, పెంటయ్య, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.