Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన అటవీ విధానం-2019తో ఆడవి బిడ్డలు ఆగం
- అడవిని రక్షించే గిరజనులు ఆక్రమణ దారులా?
- సహజ వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర
- మోడీ నూతన చట్టానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ గొంతెత్తాలి : ఏఏఆర్ఎమ్ ప్రధాన కార్యదర్శి జితేంద్ర చౌదరి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీ గిరిజనుల హక్కుల్ని హరిస్తున్న మోడీ సర్కార్ విధానాల్ని మార్చుకోవాలనీ, నూతన అటవీ విధానం-2019తో అడవి బిడ్డల బతుకులు ఆగం చేయోద్దని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్(ఏఏఆర్ఎమ్) ప్రధాన కార్యదర్శి జితేంద్ర చౌదరి హెచ్చరించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆ సంఘం జాతీయ సహాయ కార్యదర్శి గురుశాంత్, టీజీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకపోగా..నూతన అటవీ విధానం-2019 పేరుతో ఒక బిల్లును తీసుకొస్తున్నదని చెప్పారు. ఈ బిల్లు ఆదివాసీ గిరిజనుల హక్కులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 వామపక్షాల ఒత్తిడితో నాడు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయకపోవటం వల్ల ఆదివాసులకు అటవీ భూములపై రావాల్సిన హక్కులు కోల్పోయారని తెలిపారు. దేశ వ్యాప్తంగా 20శాతం కూడా వారికి హక్కులు కల్పించబడలేదన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నదని చెప్పారు. అడవి నుంచి గిరిజనులను తరిమేయాలనే కుట్రలో భాగంగానే గిరిజనుల అనుకూల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నదని చెప్పారు. అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించేందుకు అడ్డమొస్తున్న చట్టాలను నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ కంకణం కట్టుకుందని విమర్శించారు. అందులో భాగంగానే బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నదని చెప్పారు. మోడీ తెస్తున్న బిల్లు వలన ఆదివాసులకు భూమిపై వ్యక్తిగత హక్కులు నిరాకరించబడతాయని తెలిపారు. పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టం గిరిజన తెగలకు హక్కులు ఇవ్వాలంటుంటే..మోడీ తెస్తున్న బిల్లు హక్కుల్ని హరిస్తుందని తెలిపారు. ఇది దుర్మార్గమైన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. అడవిని రక్షించే గిరిజనులు..ఆక్రమణ దారులని మోడీ ప్రభుత్వం ముద్రవేస్తుందని చెప్పారు. అటవీ సంపదను కార్పొరేట్లు లూఠీ చేసేందుకు వీలుగా గిరిజనులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న గిరిజన బిల్లు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నదనీ, లక్షల మంది గిరిజనులను నిరాశ్రయులను చేస్తున్నదని చెప్పారు.రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో బీజేపీకి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నదనీ, ఆదివాసీలకు నష్టం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా ఉద్యమించాలని కోరారు. దుర్మార్గమైన బిల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, వారి ఎంపీలు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రణాళికలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే అర్హులైన గిరిజనులందరికీ హక్కుపత్రాలు ఇస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. మొత్తం 13లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాల్సిందుండగా.. 2008లో నాటి ప్రభుత్వం 3.5లక్షల ఎకరాలకు మాత్రమే హక్కుపత్రాలిచ్చి చేతులు దులుపుకుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఏడున్నరే ండ్ల కాలంలో ఒక్క ఎకరాకు కూడా హక్కు పత్రం ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ గిరిజన సంఘం, ఇతర గిరిజన, వామపక్ష, రాజకీయ పార్టీల వత్తిడితో గత నెల రోజులుగా గ్రామ స్థాయిలో సుమారు 1.30వేల ధరఖాస్తులు స్వీకరించిందని తెలిపారు. వాటిని తాత్సారం చేయకుండా పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆలిండియా సహాయ కార్యదర్శి గురుశాంత్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో జీవిస్తున్న గిరిజన తెగల ఉపాధిని కూడా దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని చెప్పారు. కరోనా కాలంలో లక్షలాది మంది ఆదివాసీ తెగలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. వారిని ఆర్థికంగా ఆదుకోవటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.