Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంఘం నేతలతో భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాల్సిందేననీ, 50 శాతమున్న వారికి రాజ్యాంగ బద్ధంగా హక్కులు కల్పించాలని తమ పార్టీ తీర్మానం కూడా చేసిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో డి.రాజాతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలోని బృందం భేటీ అయ్యింది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్లో బిల్లు పెట్టేలా చూడాలనీ, త్వరలో జరిగే జనగణనలో బీసీగణన చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని బీసీ సంఘం నేతలు కోరారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ..50 శాతం జనాభా గల బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, ప్రజాస్వామ్య వాటా ఇవ్వాలనే పోరాటానికి సీపీఐ మద్దతు పూర్తిగా ఉంటుందని హామీనిచ్చారు. 2642 బీసీ సామాజిక తరగతుల్లో 2200 అత్యంత వెనుకబడిన సామాజిక తరగతులేనని చెప్పారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్యకు రాజా అభినందనలు తెలిపారు. ఈ చర్చల్లో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, కోలా జనార్ధన్, సి. రాజేందర్, భూపేశ్ సాగర్, అంజి, మల్లేష్ యాదవ్, శివ, మధుసూదనరావు, నిఖిల్, రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.