Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాంతిభద్రతలు అదుపులో లేక భయాందోళన
- బీజేపీ కార్యాలయాలుగా పోలీస్స్టేషన్లు
- సీపీఐ(ఎం) ఆఫీసులు,నాయకులపై దాడి
- ప్రజలను మోసం చేసిన ప్రధాని మోడీ
- నాలుగేండ్లలో కనిపించని అభివృద్ధి
- వామపక్ష ప్రభుత్వం వల్లే గిరిజనుల్లో ప్రగతి
- ఉపాధి హామీ పనులు 50 రోజులూ కల్పించడం లేదు
- నవతెలంగాణతో సీపీఐ(ఎం) త్రిపుర కార్యదర్శి జితేంద్ర చౌదరి
త్రిపురలో బీజేపీ ప్రభుత్వం గూండాగిరీ చెలాయిస్తున్నదని సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి విమర్శించారు. శాంతిభద్రతలు అదుపులో లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయాలుగా పోలీసు స్టేషన్లు మారాయని అన్నారు. బీజేపీకి రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న సీపీఐ(ఎం) నాయకులు, ఆ పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నదని చెప్పారు. ఆ పార్టీకి అభివృద్ధి ఎజెండా లేదనీ, మతకలహాలు సృష్టించడం, విద్వేషాలు పెంచడం, రాజకీయంగా లబ్ధిపొందడమే లక్ష్యమని విమర్శించారు. త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లయినా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చేసిన నిర్ణయాల వల్లే గిరిజనుల్లో ప్రగతి సాధ్యమైందని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు జితేంద్ర చౌదరి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి విధానాలను అవలంభిస్తున్నది?
బీజేపీ కేంద్రంలో, యూపీలో, హర్యానాలో, త్రిపురలో ఎక్కడ అధికారంలో ఉన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలనే అవలంభిస్తున్నది. త్రిపురలో ప్రత్యేకంగా విధానాలుండవు. మనువాద విధానాలతో పనిచేస్తున్నది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందంటూ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ప్రచారం చేశారు. ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లయ్యింది. కానీ అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. త్రిపుర ప్రజలను ప్రధాని మోడీ మోసం చేశారు. బీజేపీ గెలిచాక ప్రజలకు ఎక్కడ మేలు కలిగిందో ప్రధాని వివరించాలి.
ఆర్థికపరమైన సమస్యలు ఎలా ఉన్నాయి. సహజ వనరుల గురించి వివరించండి?
మా రాష్ట్రంలో సహజ వనరులు ఎక్కువున్నాయి. కేంద్రంలో గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నా త్రిపుర అభివృద్ధికి సహకారం పూర్తిస్థాయిలో అందించలేదు. రబ్బర్ ఉత్పత్తిలో దేశంలోనే త్రిపుర రెండోస్థానంలో ఉన్నది. పైనాపిల్, జాక్‌ఫ్రూట్ వంటివి ఎక్కువగా లభిస్తాయి. రబ్బర్ ఉత్పత్తికి కేంద్ర పెట్టుబడి పెట్టడం లేదు. అక్కడ 60 శాతం అటవీ భూమి ఉన్నది. దీంతో టింబర్ ఎక్కువగా దొరుకుతుంది. గిరిజనులు ఎక్కువగా ఉన్నందున వారి ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉంటుంది. రబ్బర్, సహజ వాయువు, టింబర్‌ను ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలి. కానీ అలా చేయడం లేదు.
ఉపాధి హామీ చట్టం అమలు తీరు ఎలా ఉందంటారు?
వామపక్ష ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టం అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచాం. నేను రెండుసార్లు గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా పనిచేశాను. ఉపాధి హామీ చట్టం ప్రారంభం నుంచి అమలులో నెంబర్‌వన్‌గా ఉన్నాం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. ఉపాధి హామీ పనులను వంద రోజులకు బదులు 50 రోజులూ కల్పించడం లేదు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. ప్రజల ఆదాయం 50 శాతానికి తగ్గింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వామపక్ష ప్రభుత్వం ఉన్నపుడు అటవీ హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేశాం. 1.25 లక్షల హెక్టార్ల భూమికి సంబంధించిన 1.30 లక్షల దరఖాస్తులను పరిష్కరించాం.
తక్కువ సమయంలోనే బీజేపీ ఎలా బలోపేతం అయ్యిందంటారు?
తక్కువ సమయంలో బీజేపీ బలోపేతం కాలేదు. త్రిపురలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా టీఎంసీలోకి వెళ్లారు. వారంతా బీజేపీలోకి మారారు. అలా అధికారంలోకి వచ్చారు. నాలుగేండ్ల నుంచి అభివృద్ధి పనులు చేయడం లేదు. అధికారాన్ని ఉపయోగించి గూండాగిరీ చేస్తున్నది. స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికలేవైనా ప్రజల మద్దతుతో గెలవడం లేదు. అధికారాన్ని ఉపయోగించి ప్రజలను భయపెట్టి గెలుస్తున్నది. ప్రలోభాలకు గురిచేస్తున్నది. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ గెలవదు. ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. పోలీసులే బీజేపీ గూండాల్లా పనిచేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు బీజేపీ కార్యాలయాలుగా మారాయి. పోలీసులు, బీజేపీ గూండాలు, ఈసీ అధికారులు కలిసి ఎన్నికల ప్రక్రియను కలుషితం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ లేదు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారు.
బీజేపీ విధానాలపై వామపక్షాలు ముఖ్యంగా సీపీఐ(ఎం) ఎలాంటి పోరాటాలను నిర్వహిస్తున్నది?
సీపీఐ(ఎం) కార్మికుల పార్టీ. పేదల పక్షాన ప్రజా సమస్యలపై నికరంగా పోరాడుతుంది. నిజాయితీగా ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తుంది. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్మిస్తుంది. వామపక్ష ప్రభుత్వం ఉన్నపుడు రాజ్యంగా బద్ధంగా పాలన సాగించింది. ఉపాధి హామీని ఆదర్శంగా అమలు చేసింది. విద్యావైద్యం, మానవ వనరుల అభివృద్ధి సూచిలో అగ్రభాగాన నిలిచింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వాటిని విస్మరించింది. సీపీఐ(ఎం) టార్గెట్‌గా పనిచేస్తున్నది. బీజేపీ అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలను నిరంతరం ప్రతిఘటిస్తున్నాం. ప్రజలను చైతన్యం చేసి ఐక్యత పెంపొందించి ఉద్యమాలకు సన్నద్ధం చేస్తాం. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకూ విశ్రమించేది లేదు.